విపక్ష ఓట్లను తొక్కేద్దాం..
డీఈఓ కార్యాలయమే అడ్డాగా పచ్చమూక కుతంత్రాలు
సాక్షి, టాస్క్ఫోర్స్ : బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు, ఎన్నికల కోడ్ను బేఖాతరు చేస్తూ పచ్చ చొక్కాలు తొడుక్కున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమికి అనుకూలంగా పని చేయడమే లక్ష్యంగా డీఈఓ కార్యాలయాన్ని టీడీపీ ఆఫీస్గా మార్చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండి, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడకూడదని ఆంక్షలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ పక్కనబెట్టి డీఈవో కార్యాలయంలో రహస్య సమావేశాలు నిర్వహించడం కలకలం రేపుతోంది.
ఉదయాన్నే ‘షాడో’ రాజకీయం
సాధారణంగా కార్యాలయ సిబ్బంది విధుల్లోకి రాని సమయం చూసి, ఈ నెల 16న ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు డీఈఓ ఆఫీసులో ఒక రహస్య సమావేశం నడిచింది. ‘నోబుల్ టీచర్స్’ సంఘం జిల్లా నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో దాదాపు 30 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘పోల్ మేనేజ్మెంట్’ ఎలా చేయాలి? కూటమి అభ్యర్థులకు ఎలా సహకరించాలి? అనే అంశంపై మాస్టర్ ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది.
రిగ్గింగ్కు సహకారం
ఎన్నికల రోజున కూటమి నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడితే చూసీచూడనట్లు వ్యవహరించాలని, ఇతర పార్టీల ఓటర్లను ఇబ్బందులకు గురిచేసి ఓటింగ్ శాతాన్ని తగ్గించేలా లోలోపల స్కెచ్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉండే ఉపాధ్యాయులను ప్రత్యేక టీమ్లుగా విభజించి, కూటమికి అనుకూలంగా పనిచేసేలా ఒత్తిడి తెస్తున్నారు. మాట వినని ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేసి అయినా సరే తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఎన్నికల అధికారి విచారణ జరపాలి
జిల్లా ఎన్నికల అధికారుల కళ్లు గప్పి విద్యాశాఖను టీడీపీ కార్యాలయంగా మార్చేసి రహస్యంగా ప్లాన్లు వేస్తున్న ఈ ‘షాడో’ అధికారుల వ్యవహారం టీచర్లలో చర్చనీయాంశంగా మారింది. రహస్య సమావేశాలపై ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 144 సెక్షన్ నిబంధనలను ఉల్లంఘించి రహస్య సమావేశం నిర్వహించిన నోబుల్ టీచర్స్ సంఘం నాయకుడిపై, అతనికి సహకరించిన అధికారులపై జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల విధుల కేటాయింపులో అక్రమాలు
ఈ మొత్తం వ్యవహారంలో డీఈఓ కార్యాలయంలోని పరీక్షల విభాగం, ఓపెన్ స్కూల్ విభాగం అధికారి, అలాగే సమగ్ర శిక్ష శాఖలోని ఒక కీలక అధికారి షాడో లా వ్యవహరిస్తూ సూత్రధారులుగా మారారు. టీడీపీ ప్రజాప్రతినిధులతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న సమగ్ర శిక్ష అధికారికి ఎన్నికల ప్రక్రియలో కీలకమైన మ్యాన్ పవర్ కసరత్తు (ఎన్నికల ఆర్డర్లు జారీ చేసే) బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నచ్చిన వారికి, అనుకూలంగా ఉండే వారికి ప్రయోజనకరమైన ప్రాంతాల్లో డ్యూటీ లు వేసేందుకు టీమ్లను సిద్ధం చేస్తున్నట్లు భోగట్టా.


