చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని అశోకపురం మాజీ కార్పొరేటర్ సుష్మ భర్త, టీడీపీ నేత దాడి మున్నా వైఎస్సార్సీపీలో చేరారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి వైఎస్సార్సీపీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.
సీసీ టీవీ, సెక్యూరిటీ
అలారమ్పై ఉచిత శిక్షణ
చంద్రగిరి:యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో అక్టోబర్ 26 తేదీ (సోమవారం) నుంచి 14 రోజుల పాటు పురుషులకు సీసీ టీవీ ఇన్స్టాల్, సెక్యూరిటీ అలారమ్, స్మోక్ డిటెక్టర్లపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ బాలకోటి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తెల్లరేషన్ కార్డు కలిగిన తిరుపతి జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పురుషులు అర్హులని తెలిపారు. కనీస విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ట్రైనీస్కి ఉచిత భోజనంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఏదైనా ఎడ్యుకేషన్ ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూ చించారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. ఫోన్: 79896 80587, 87908 60657, 96764 50037 నంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాద్రంలో
నిండ్రవాసి దుర్మరణం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా నిండ్ర మండలానికి చెందిన ఓ యువకుడు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్రమండలం ఎలకాటూరు గ్రామానికి చెందిన మహేష్(29)కు వివాహమై భార్య రేవతి(27) వున్నారు. ఇతను తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా తేరువాయి కండ్రిగ గ్రామంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ, సూలైమేణి గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం తన సొంతూరుకు వెళ్లిన మహేష్, శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో విధులకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. ఊత్తుకోట–పెద్దపాళ్యం రోడ్డులో వస్తున్న సమయంలో ఇటుకరాళ్ల లోడ్తో వస్తున్న లారీమహేష్ ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మేహేష్ అక్కడిక్కడే మృతి చెందారు. స్థానిక పోలీసులు మహేష్ మృతదేహాన్ని కై వసం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరులో కుండపోత
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన వాన దాదాపు గంట పాటు కుండపోతంగా కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లి నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. అలాగే జీడీనెల్లూరు మండలంలో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే అదే నియోజకవర్గానికి చెందిన మిగిలిన మండలాల్లో మాత్రం తేలికపాటి వర్షం కురిసింది. అలాగే కుప్పంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో చిరుజల్లులు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగాయి. పలమనేరు, నగరి నియోజకవర్గాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు మాత్రమే కురిశాయి.
21న పోలింగ్ సిబ్బందికి శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలను వేగవంతం చేసింది. ఎన్నికల విధులకు ఎంపిక చేసిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు (ఏపీవో)లకు ఈ నెల 21వ తేదీన మొదటి విడత శిక్షణ తరగతులను ప్రారంభించనున్నారు. శనివారంఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా 4,126 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను ఎన్నికల విధులకు కేటాయించినట్లు చెప్పారు. ఈ నెల 17న జెడ్పీ సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. శిక్షణ కేంద్రాల వద్ద సిబ్బందికి తాగునీరు, భోజన వసతి, స్టేషనరీ, రూల్స్ పుస్తకాలను సిద్ధం చేయాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. విధులకు కేటాయించిన ఉద్యోగులందరూ 100 శాతం హాజరుకావాలని, గైర్హాజరైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


