పాత పింఛన్లనే పంపిణీ చేసి.. కొత్తవారి ఆశలపై నీళ్లు జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 43 వేలకు పైగా దరఖాస్తులు ఐదు వేలకు పైగా లబ్ధిదారులు అనర్హులట! ఎన్నికల కోడ్ వచ్చాక పింఛను మంజూరు సాధ్యమేనా?
ఎదురు చూపులే..
చిత్తూరు నగరం శ్రీనివాస కాలనీకి చెందిన సుకుమా ర్ చర్మకారుడు. 22 ఏళ్లుగా పీసీఆర్ సర్కిల్ వద్ద రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతోనే తన పిల్లలు దీపిక (7వ తరగతి), చెర్రీ (5వ తరగతి), మహేంద్ర (3వ తరగతి)లను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. రోజుకు వచ్చే రూ.300 ఆదాయం కుటుంబ పోషణకు చాలడం లేదు. చర్మకారుల కేటగిరీలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఒకటోతేదీన పింఛన్ డబ్బు వస్తుందని గంపెడాశతో ఎదురు చూశాడు. మీకు పింఛన్ రాలేదంటూ సచివాలయ ఉద్యోగి చెప్పడంతో నిరాశచెందాడు.
దరఖాస్తే తీసుకోలేదు
చిత్తూరు సంతపేటకు చెందిన సరోజ భర్త చంద్ర లారీ డ్రైవర్. అతను ఏడాదిన్నర క్రితం మృతిచెందాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా వారు తిరుపతిలో ఉంటున్నారు. సరోజ సోదరి రాజమ్మకు ఎవరూ లేకపోవడంతో ఆమె కూడా సరోజ వద్దే ఉంటోంది. రాజమ్మకు వృద్ధాప్య పింఛన్ వచ్చేది. గతంలో ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వలేమంటూ సచివాలయ అధికారులు ఆమె పింఛను రద్దు చేశారు. ఐదు నెలల క్రితం రాజమ్మ మృతిచెందారు. తర్వాత తనకు వితంతు పింఛన్ ఇప్పించాలని సరోజ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఆమె నాలుగు ఇళ్లలో పనిచేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తోంది.
పింఛన్‌కోసం ఎదురుచూపులే
ఈమె పేరు అమరజ్యోతి. గుడిపాల మండలం వసంతాపురం గ్రామం. ఈమె భర్త రెండున్నరేళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటినుంచి పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఆమె భర్త గతంలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ నెలకు రూ.20 వేలు సంపాదించి కుటుంబ పోషణ చూసుకునేవాడు. ప్రస్తుతం అతను లేకపోవడంతో ఇంటి పరిస్థితి ఏమాత్రం బాలేదు. కొత్త పింఛన్ ఒకటో తేదీన వస్తుందని చెప్పడంతో ఉదయం నుంచి ఆశగా ఉన్న జ్యోతికి పింఛన్ ఇప్పట్లో ఇవ్వడంలేదనే మాట నిరాశను మిగిల్చింది.
సాక్షి, చిత్తూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన 28 నెలల తర్వాత కొత్త పింఛన్ల కోసం అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోవడానికి 12 రోజుల గడువు పెట్టింది. కులం సర్టిఫికెట్లు, ఆదాయం, స్థానిక సర్టిఫికెట్లు తీసుకోవడానికే కొందరికి సమయం చాల్లేదు. గడువు సమయం ముగిసే సమయానికి వందలాది మంది దరఖాస్తు కూడా చేసుకోలేకపోయారు. ఇక దరఖాస్తు చేసుకున్న వారు ఒకటో తేదీన పింఛన్ అందుతుందని గంపెడాశలతో ఎదురు చూశారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. కొత్త పింఛన్లు ఇప్పట్లో ఇవ్వడంలేదని చెప్పేశారు. ఈ నెల నుంచి పింఛన్ డబ్బులు అందుతుందని ఆశ పడిన వారి ఆశలు అడియాశలయ్యాయి. అసలు దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ పింఛన్ వస్తుందా..? వేలాది మందికి పింఛన్ ఇప్పట్లో అందుతుందా..? అసలు పింఛన్ ఎప్పుడిస్తారు..? అన్నదానిపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు.
భారీగా అనర్హుల జాబితా
కొత్త పింఛన్ల కోసం గతనెల దరఖాస్తులు ఆహ్వానించడం, ఆపై జిల్లా వ్యాప్తంగా 43,767 మంది దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. ఇందులో అత్యధికంగా 23,304 మంది వృద్ధులు ఉన్నారు. ఒక ఇంట్లో వికలాంగ పింఛన్ తీసుకుంటుంటే వృద్ధాప్య పింఛను దరఖాస్తులను అధికారులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. అన్ని కేటగిరీల్లోనూ ఒకే ఇంట్లో రెండో పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అసలు పింఛన్ వస్తుందో..? రాదో..? తెలియని పరిస్థితి. ఇలా దాదాపు 7 వేల మందికి పైగా దరఖాస్తులను తిరస్కరించినట్లు ప్రాథమిక సమాచారం. ఇది చాలదన్నట్లు కొత్త పింఛన్ల మంజూరు కోసం కొన్నిచోట్ల తమ్ముళ్లు దళారుల అవతారం ఎత్తారు. ఒక్కో పింఛన్‌కు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు జేబులో వేసుకున్నారు. మరికొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలకు సర్టిఫికెట్లు ఇప్పించి, పింఛన్ కోసం దరఖాస్తులు పెట్టించారు. మొత్తం 43,493 దరఖాస్తుల్లో జిల్లా స్థాయిలో 36,342 మాత్రమే ఆమోదించి.. 7,425 తిరస్కరించారు. మళ్లీ రాష్ట్రస్థాయి విచారణలో మరికొంత మంది దరఖాస్తులను తిరస్కరించనున్నారు. ఇలా పింఛన్ వస్తే తప్ప ఏదీ తెలియదు.
‘కోడ్’ కూస్తే ఏం చేస్తారు?
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దరఖాస్తులు ఆహ్వానించినా, అర్హులకు అక్టోబర్ 1వ తేదీనే పింఛన్లు ఇచ్చేసి ఉండొచ్చు. వెంటనే పింఛన్ ఇస్తే తమను మరచిపోయే ప్రమాదం ఉందని, పంచాయతీ–మునిసిపల్ ఎన్నికలు దగ్గర పడినప్పుడు పింఛన్ పంపిణీ చేద్దామని పచ్చ ప్రణాళిక రూపొందింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపడంతో, పింఛన్ అందేలోపు మరో మూడు నెలల సమయం పట్టనుంది. ఈ లోపు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తెలిసే, కూటమి ప్రభుత్వం అభాగ్యుల భావోద్వేగాలతో పింఛన్ పేరు చెప్పి ఆడుకుంటోంది.
ఏళ్లుగా నిరీక్షణే
కుప్పం మండలం దాసేగానూరుకు చెందిన రత్నమ్మ భర్త 18 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆమె వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కొడుకు తిరుపతిలో ఉంటూ అక్కడి ట్రాన్స్‌కో సంస్థలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. తనకు పింఛన్ ఇప్పించాలని రత్నమ్మ ఎక్కని ప్రభుత్వ కార్యాలయ గడపలేదు. కరుణించమని అడగని అధికారిలేడు. తాజాగా కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఒకటో తేదీ ఇంటి వద్దకే వచ్చి నీకు పింఛన్ ఇస్తారు అని అధికారులు భరోసా ఇచ్చారు. కానీ రత్నమ్మకు ఒకటో తేదీన భరోసా అందలేదు.
రెండేళ్లుగా తిరుగుతున్నా పింఛన్ అందలేదు
ఈయన పేరు షణ్ముగం. నగరి మండలం కావేటిపురం దళితవాడకు చెందిన వారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు తీసేశారు. దీంతో పనులు చేయలేక పూల దుకాణంలో ఆకులు కత్తిరించే పనిచేస్తున్నాడు. వచ్చే అంతంత మాత్రం డబ్బులతో బతుకు బండిని లాగుతున్నాడు. వికలాంగ పెన్షన్ కోసం రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. కొత్తగా పెన్షన్ మంజూరైందని అధికారులు చెబుతున్నా నేటి వరకు పెన్షన్ ఇతనికి అందలేదు.
జీవనాధారం లేకుండా పోయింది
ఈమె పేరు అమరజ్యోతి. గుడిపాల మండలం వసంతాపురం గ్రామం. ఈమె భర్త రెండున్నరేళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటి నుంచి పింఛన్‌కోసం ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా రాలేదు. ఆమె భర్త గతంలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ నెలకు రూ.20 వేలు సంపాదించి కుటుంబపోషణ చూసుకునే వాడు. ప్రస్తుతం ఆయన లేకపోవడంతో జీవనాధారం లేకుండా పోయింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అక్టోబర్ 1వ తేదీన పింఛన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఎంతో ఆశ పడింది. కొత్త పింఛన్లు ఇవ్వలేదు. వెంటనే ఇచ్చే విధంగా చూస్తే బాగుంటుందని ఆమె పేర్కొంది.
ఒకటో తేదీన పింఛన్ ఇస్తారని అభాగ్యుల ఆశలు
జిల్లాలో కొత్త ఫించన్ల వివరాలు
కేటగిరీ దరఖాస్తులు తిరస్కరణ
వృద్ధులు 23,793 4,218
వితంతువులు 8,804 1576
దివ్యాంగులు 7,129 971
డప్పు కళాకారులు 3,816 311
చర్మకారులు 524 78
ఒంటరి మహిళలు 327 73
కళ్లు గీత కార్మికులు 127 33
చేనేత కార్మికులు 141 129
మత్స్యకారులు 77 34
ట్రాన్స్‌జెండర్లు 11 2


