గంగాధర నెల్లూరు: మండలంలోని ముసలయ్యగారిపల్లి రోడ్డు సమీపంలో తర్చూ రు–బెంగళూరు హైవేపై గురువారం బైక్ ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలో ముసలయ్యగారిపల్లి రోడ్డు సమీపంలోని తర్చూరు–బెంగళూరు హైవేపై గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుని వెళ్తున్నాడు. అదే దారిలో చైన్నె వైపు బైక్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌లో వెళుతున్న వ్యక్తి కూడా గాయపడ్డాడు. అన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీలో ఉంచామని, అతని ఆచూకీ తెలిసిన వారు జీడీ నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ కృష్ణమోహన్ తెలిపారు.
చిత్తూరులో పోలీస్ యాక్ట్ అమలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు సబ్–డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం గురువారం నుంచి 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు డీఎస్పీ జె.వెంకటనారాయణ తెలిపారు. సబ్–డివిజన్ పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు వన్ టౌన్, టూ టౌన్, తాలూకా, జి.డి.నెల్లూరు, బీఎన్‌ఆర్ పేట, పెనుమూరు, యాదమరి, గుడిపాల, తవణంపల్లి, కాణిపాకం, పూతలపట్టు, ఐరాల, కల్లూరు, రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ సహకరించాలని డీఎస్పీ కోరారు.
ఉద్యోగం రాలేదని
యువకుడి ఆత్మహత్య
కార్వేటినగరం: ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. కేఎంపురం గ్రామానికి చెందిన పి.ముత్యాలు కుమారుడు పి.వేణు(28) డిగ్రీ, డైట్ విద్యనభ్యసించాడు. అతను ఎక్కడికి వెళ్లినా ఉద్యోగం దొరకకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. గత నెల 28వ తేదీన విషపు ఆకు తిని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 30వ తేదీ రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కార్వేటినగరం పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మద్యం దుకాణాలకు
‘సిండికేట్’ సమస్య
– 18 దుకాణాలకు 28 దరఖాస్తులు
– ముగిసిన గడువు
సాక్షి, చిత్తూరు: జిల్లాలో రెన్యువల్ చేసుకోకుండా మిగిలిపోయిన 19 మద్యం దుకాణాల నిర్వహణ కోసం అధికారులు దరఖాస్తులు ఆహ్వానించగా.. సిండికేట్ సమస్య తలెత్తింది. గురువారం అర్ధరాత్రి వరకు గడువు ఉండగా, చివరి సమయానికి 28 దరఖాస్తులు అందినట్లు తెలిసింది. అన్–రిజర్వుడు కేటగిరీలో 18 దుకాణాలకు 28 దరఖాస్తులు అందినట్లు సమాచారం. దీంతో ఒక్కో దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లక్కీడిప్ తీస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించడంతో.. అన్ని దుకాణాలకు నాలుగు దరఖాస్తులు పడలేదని తెలుస్తోంది. ఈనెల 5వ తేదీన చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో లక్కీడిప్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఒక్కో దుకాణానికి నాలుగు దరఖాస్తులు రానిపక్షంలో.. వాటికి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.


