పూతలపట్టు జెడ్పీ హైస్కూల్
ఉపాధ్యాయులు అత్యుత్సాహం
డేంజర్ జోన్ ఊటీకి విద్యార్థుల తరలింపు
పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన
నోటీసులు ఇస్తామని డీఈఓ స్పష్టీకరణ
పూతలపట్టు(యాదమరి): చదువుల తల్లి ఒడిలో నిశ్చింతగా గడపాల్సిన విద్యార్థులను ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఘాట్ రోడ్లు, లోయలతో కూడిన ప్రమాదకర ప్రాంతాలకు తీసుకెళ్లడం పూతలపట్టులో కలకలం రేపుతోంది. స్థానిక జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కొందరు ఉపాధ్యాయుల అత్యుత్సాహం ఆ విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన నింపింది. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతులు తీసుకోకుండానే మంగళవారం తొమ్మిది, పదో తరగతికి చెందిన 60 మంది విద్యార్థులను ఊటీకి విహారయాత్రకు తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లాలంటే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. విద్యాశాఖ అనుమతితో పాటు, రూట్‌మ్యాప్, విద్యార్థుల భద్రతపై హామీ పత్రం తప్పనిసరి. విద్యార్థుల విజ్ఞాన వికాసానికి ఉపయోగపడే ఏ సైన్స్ సెంటర్లకో అనుమతులు ఇస్తారు. పూతలపట్టు జెడ్పీ హైస్కూల్ టీచర్లు ఈ నియమాలను తుంగలో తొక్కారు. గుట్టుచప్పుడు కాకుండా ఊటీకి తీసుకెళ్లారు. ప్రస్తుత అక్కడి వాతావరణం, ప్రమాదకర లోయల గురించి వింటున్న తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
అప్పులు చేసి మరీ..
ఈ యాత్ర వెనుక బలవంతపు వసూళ్ల పర్వం నడిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఊటీ వెళ్లడానికి ఒక్కొక్కరు రూ.3 వేలు కట్టాలని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో పిల్లలు ఇళ్లలో తల్లిదండ్రులను పీడించారు. పిల్లల మనసు ఎక్కడ నొచ్చుకుంటుందోనని ఆర్థిక స్థోమత లేకపోయినా చాలా మంది అప్పు చేసి రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఇచ్చి పింపించినట్టు సమాచారం. ఈ నిబంధనల ఉల్లంఘన వ్యవహారం బయటకు పొక్కడంతో ఉపాధ్యాయులు ఒక్కొక్కరు ఒక్కోలా వివరణ ఇచ్చారు. స్కూల్లోని ఒక ఉపాధ్యాయుడి ఒత్తిడి భరించలేకే తాము ఈ యాత్రకు ఒప్పుకోవాల్సి వచ్చిందని కొందరు ఉపాధ్యాయులు అంతర్గతంగా లబోదిబోమంటున్నారు. మరికొందరు మాత్రం మేమేం బలవంతం చేయలేదు, పిల్లలే ఊటీ చూడాలని పట్టుబట్టారు, వారి కోరిక మేరకే తీసుకెళ్లాం అంటూ తప్పును విద్యార్థుల పైకి నెట్టేసి సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. ఈ అంశంపై డీఈఓ లక్ష్మీనారాయణను వివరణ కోరగా యాత్రకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ఇలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేస్తామని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


