చిత్తూరు కలెక్టరేట్ : మానవాళి సంక్షేమానికే భారత్ అంతరిక్ష సాంకేతికత అని ఇస్రో మాజీ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిరణ్‌కుమార్ తెలిపారు. చిత్తూరు నగర సరిహద్దులోని సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం అంతరిక్ష శాస్త్రంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఇందులో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అంతరిక్ష రంగాన్ని ఎక్కువగా సైనిక అవసరాలకు ఉపయోగిస్తుంటే, భారతదేశం మాత్రం మానవాళి శ్రేయస్సు, సమాజ అభివృద్ధి కోసమే అంతరిక్ష సాంకేతికతను వినియోగించిందన్నారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ దార్శనికత వల్లే భారత్ అంతరిక్ష రంగంలో దృఢంగా నిలబడిందన్నారు. ఆరంభంలో సాంకేతికతను నిరాకరించినా, స్వదేశీ పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ నుంచి నేటి వర్క్ హార్స్ పీఎస్‌ఎల్‌వీ వరకు ఇస్రో అద్భుత ప్రగతి సాధించిందన్నారు. 300లకు పైగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిందని వివరించారు.
చంద్రయాన్ నుంచి ఆదిత్య ఎల్1 వరకు
చారిత్రాత్మక విజయాలు
చంద్రయాన్–1తో చంద్రునిపై నీటి అణువులను గుర్తించి ప్రపంచ దృష్టిని ఆకర్షించామని కిరణ్‌కుమార్ తెలిపారు. చంద్రయాన్–3తో చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. హాలీవుడ్ సినిమా నిర్మాణ వ్యయం కంటే తక్కువ ఖర్చుతో మొదటి ప్రయత్నంలోనే ‘మంగళయాన్’ మిషన్ విజయవంతం చేశామన్నారు. ప్రస్తుతం సూర్యుడిపై అధ్యయనానికి ‘ఆదిత్య ఎల్1’ను నిర్వహించామని తెలిపారు.
స్పేస్ సైన్స్‌లో ఏఐ, ఎంఎల్ పాత్ర కీలకం
భవిష్యత్తులో అంతరిక్ష సాంకేతికతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), రోబోటిక్స్ పూర్తిగా మార్చివేయబోతున్నాయని కిరణ్‌కుమార్ చెప్పారు. ఉపగ్రహాల స్వయం ప్రతిపత్తి నావిగేషన్, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, గగన్‌యాన్‌లో స్పేస్ రోబోటిక్స్, రాకెట్ల ముందస్తు మెయింటెనెన్స్‌లో ఏఐ కీలకమవుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్‌లకు విస్తరించడం వల్ల ట్రిలియన్ డాలర్ల అవకాశాలు లభిస్తున్నాయన్నారు. విద్యార్థులు ప్రాథమిక అంశాలపై దృష్టి సారించి పరిశోధనల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఏఐ అనేది శాస్త్రవేత్తల స్థానాన్ని భర్తీ చేయలేదని, నిర్ణయాలను మరింత వేగంగా, కచ్చితంగా తీసుకోవడానికి సాయపడుతుందని స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఇస్రో చైర్మన్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రంగనాథం, సీఈ నాగేంద్రప్రసాద్, అకడమిక్ అడ్వైజర్ నారాయణ, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పళనివేల్, హెచ్‌వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


