కుప్పం రూరల్ : కుప్పం పట్టణ సమీపంలోని తంబిగానిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఇండియా –1 ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి యత్నించారు. గమనించిన పక్కన ఉన్న వారు కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. దుండగులు అప్పటికే డిస్‌ప్లేను తొలగించి ఏటీఎం వెనుక భాగాన్ని కొంతమేరకు ధ్వంసం చేసినట్టు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఉదయం విచారణ చేపట్టారు. ఏటీఎంలో ఎంత నగదు ఉంది? ఎంత చోరీకి గురైంది అనే విషయాలపై ఆరా తీశారు.
కార్వేటినగరం సీఈఓ సస్పెన్షన్
– క్రిమినల్ కేసు నమోదుకు జిల్లా కలెక్టర్ ఆదేశం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చోటుచేసుకున్న ఆర్థిక అక్రమాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో కార్వేటినగరం సహకార సంఘం సీఈఓ ఎస్.దుష్యంత్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కార్వేటినగరం సహకార సంఘంలో సీఈవో దుష్యంత్ కుమార్ నిబంధనలను పక్కనబెట్టి పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా బంగారం, ఇతర రుణాలను రూ.కోట్లలో మంజూరు చేశారు. రైతులు చెల్లించిన నగదు, డిపాజిట్లను ఖాతాల్లో జమ చేయకుండా, పూర్తయిన రుణాలను మళ్లీ తెరిచి చూపించడం, అర్హతలేని వారికి రుణాలు ఇవ్వడం తదితర అవకతవకలకు పాల్పడ్డారు. దీనిపై జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా కలెక్టర్ సహా ముఖ్యమంత్రి కార్యాలయానికి పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో జిల్లా సహకార శాఖ నుంచి సీనియర్ ఇన్‌స్పెక్టర్ సులోచన నేతృత్వంలో అధికారులు విచారణ చేపట్టారు. దుష్యంత్ కుమార్ విచారణకు సహకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అన్యాయాన్ని చెప్పడానికి వచ్చిన బాధితులు, రైతులను దూషిస్తూ దాడికి దిగారు. దీనిపై సీనియర్ ఇన్‌స్పెక్టర్ నివేదిక అందించడంతో జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. జిల్లా స్థాయి సాధికార కమిటీ, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యాజమాన్య మండలి సంయుక్తంగా తీర్మానం చేసి దుష్యంత్ కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగంపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో సహాయ కార్యనిర్వాహకుడు పి.నరే్‌ష్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సహకార శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


