నగరి: స్థానిక డిగ్రీ కళాశాల కేవీకే స్టేడియంలో బుధవారం జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు ఎస్‌ఎం.లోకనాథం, త్రిలోకసుందరి ఆధ్వర్యంలో అండర్–17, అండర్–19 బాలుర జిల్లా క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపారు. వారిలో 30 మందిని ఎంపిక చేశారు. వారికి అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 10వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. పీసీఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అలెక్స్, అధ్యాపకులు వాసు, చిత్తూరు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు దేవానంద్, వ్యాయామ ఉపాధ్యాయులు శరత్, మణి, రాజా, దాము, ప్రకాష్, తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై వేధింపుల పర్వం
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ సీపీ శ్రేణులను వేధించి, భయబ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా కొన్ని ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి. చిత్తూరు నగరానికి చెందిన వైఎస్సార్ సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చక్రవర్తికి చెందిన మెడికల్ షాపుపై బుధవారం ఈగల్ బృందంలోని అధికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కలిసి దాడులు చేశారు. నగరంలో వందలాది దుకాణాలు ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతోనే వైఎస్సార్ సీపీకి చెందిన నేతల దుకాణాల్లో దాడులు చేస్తున్నారని చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో క్రియాశీలకంగా ఉన్న తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తే, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చేయని నేరానికి గతంలో కూడా చక్రవర్తిని తప్పుడు కేసులో రెండు నెలల పాటు జైల్లో ఉంచారని ఆరోపించారు. ఇటీవల విజయానందరెడ్డిపై ఏఐ వీడియోలు సృష్టిస్తూ సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెడుతున్నారని, దీన్ని ప్రతిఘటిస్తూ కౌంటర్ పోస్టులు పెడుతుండడంతోనే ఈ దాడులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయాణికులను
దించేసిన కండక్టర్
గుడిపాల: గుడిపాలలో ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఉదయం 7.30 గంటలకు చిత్తూరు రెండో డిపో బస్సులో 10 మంది విద్యార్థులు, ఐదుగురు ప్రయాణికులు ఎక్కారు. అరకిలోమీటర్ వెళ్లిన తర్వాత టికెట్లు కొట్టే మెషిన్ పనిచేయలేదంటూ కండక్టర్ 15 మందిని దింపేశారు. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది టికెట్ మెషిన్ పనిచేయకపోతే ప్రత్యామ్నాయంగా టికెట్లు ఇవ్వాలని కోరగా వారు స్పందించలేదు. మెషిన్ ఎందుకు పనిచేయలేదని అడగ్గా సరైన సమాధానం చెప్పకుండానే కిందకు దించేశారు. ఆర్టీసీ సిబ్బంది పనితీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జింగ్ లేకపోవడంతోనే ఇలా అయ్యిందని అర్టీసీ వర్గాలు తెలిపాయి. టికెట్ల మిషన్‌ను కూడా చార్జింగ్ పెట్టుకోలేనంత నిర్లక్ష్యం ఉండడంతో ప్రయాణికులను వేధించడం సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.


