అవ్వాతాతలు, విద్యార్థుల చూపుతో ప్రభుత్వం చెలగాటం హామీలకే పరిమితమైన కంటి పరీక్షలు ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలకు తాళాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలల్లో ఖర్చులు ప్రభుత్వం తీరుపై పేదలు మండిపాటు
కాణిపాకం: జిల్లాలో పేదల కంటి చూపును రక్షించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కంటి పరీక్షలకు ప్రైవేటు సేవలే దిక్కుగా మారడంతో.. విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ తరుణంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగును గుర్తు చేస్తున్నారు.
పేదలకు తప్పని తిప్పలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం రాగానే తాళాలు వేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని నారావారిపల్లె, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, పి.కొత్తకోట, సత్యవేడు, తంబళ్లపల్లి తదితర సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కేంద్రాలు నిరంతరం ఉచిత సేవలు అందించేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే ఇవి మూతపడడంతో అవ్వతాతలు కంటి పరీక్షల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం జిల్లా కేంద్రం, ఏరియా ఆస్పత్రులకు మాత్రమే వచ్చి క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అక్కడ కూడా సరైన వైద్యం అందకపోవడంతో అనివార్యంగా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ ఆర్థికంగా గుల్లవుతున్నారు.
అద్దాలు అరకొరే
గతంలో వేలాది మంది పిల్లలకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయగా, 2025–26లో 51,047 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 2,910 మంది పిల్లల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ వారికి అందించిన ఉచిత కళ్లద్దాల సంఖ్య సున్న అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే 2026–27లో ఇప్పటివరకు 11,739 మంది విద్యార్థులకు పరీక్షలు జరిపి 1,023 మంది పిల్లలకు అద్దాలు అవసరమని తేల్చినా.. ఒక్క విద్యా
ర్థికి కూడా కళ్లద్దాలు ఇవ్వలేదు. ఏడాదికి ఒకసారి నిర్వహించాల్సిన విద్యార్థుల కంటి పరీక్షల ప్రక్రియ సైతం ఉపాధ్యాయుల శిక్షణ తగ్గించడంతో నత్తనడకన సాగుతోంది. సకాలంలో అద్దాలు అందక వేలాది మంది చిన్నారుల కంటి చూపు మందగించి వారి భవిష్యత్తు చీకటిమయంగా మారుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కంటి చూపుపై అలసత్వం..?
పాఠశాల విద్యార్థుల కంటి సంరక్షణ పథకాల అమలుపై ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోందని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 2024–25లో 79,615 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, 2026–27 నాటికి ఆ సంఖ్య దారుణంగా 11,739కి పడిపోయింది. ముఖ్యంగా గత రెండేళ్లుగా (2025–26, 2026–27) దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులకు ఒక్క ఉచిత కళ్లజోడు కూడా పంపిణీ చేయకపోవడం గమనార్హం. ఉపాధ్యాయుల శిక్షణ 550 నుండి 180కి, కేటరాక్ట్ శస్త్రచికిత్సలు 19,811 నుండి 5,191కి తగ్గడంతో విద్యార్థుల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే స్పందించి ఉచిత కళ్లద్దాల పంపిణీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో కంటి వెలుగు పూర్తిగా ఆరిపోయింది. పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలను తూతూమంత్రంగా నిర్వహిస్తూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండగా, అవ్వతాతలకు కంటి సేవలు కరువై తీవ్ర అవస్థలు పడుతున్నారు.
గతంలో వెలుగులు.. నేడు చీకట్లు....
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా తొలిదశలోనే 6,138 పాఠశాలల్లోని 5,64,951 మంది విద్యార్థులకు ఉచితంగా స్క్రీనింగ్ జరిపారు. రెండో దశలో 29,316 మంది పిల్లల్లో లోపాలు గుర్తించి 10,360 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందించడమే కాకుండా 19 మందికి సర్జరీలు నిర్వహించారు. అవ్వతాతలకు సైతం మూడవ దశలో 1,90,089 మందికి ద్వితీయ శ్రేణి స్క్రీనింగ్ జరిపి 60,861 అద్దాలు గుర్తించి 2,150 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు జరిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వెండర్ల నుంచి అద్దాల సరఫరాను నిలిపివేయడంతో ఉచిత కళ్లద్దాల సరఫరా పూర్తిగా శూన్యంగా మారింది.


