రూ. 50 లక్షల నిధుల దారి మళ్లింపు? డీఎస్‌ఓ కార్యాలయంలో అక్రమాలు 10 ఏళ్ల కష్టానికి లంచాల కక్కుర్తి 7 నుండి 10 శాతం ఇస్తేనే అకౌంట్లో డబ్బులు పడతాయని మెలిక తీవ్ర ఆందోళనలో పేద రేషన్ డీలర్లు
లంచం ఇచ్చిన వారి ఖాతాల్లోనే జమ?
సాక్షి టాస్క్‌ఫోర్స్ : పౌర సరఫరాల శాఖ (సివిల్ సప్లైస్) అధికారుల నిర్లక్ష్యం, కొందరు సిబ్బంది కక్కుర్తి కారణంగా రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దశాబ్ద కాలంగా నిలిచిపోయిన రేషన్ డీలర్ల కమీషన్, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం నిధులు ఎట్టకేలకు ప్రభుత్వ ఖాతా నుంచి విడుదలయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని దాదాపు 1,379 మంది డీలర్లకు సంబంధించి రూ. 50 లక్షలకు పైగా నిధులు మంజూరై ఏడాది కాలం గడుస్తున్నా, అవి ఇప్పటివరకు అసలైన లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాకపోవడం గమనార్హం.
ఫైల్ మాయం నాటకం వెనుక
దాగిన రహస్యం
ఈ వ్యవహారంలో సరికొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా సరఫరా అధికారి నిధుల విడుదల ఫైలును పరిశీలించగా, పాత సిబ్బంది ఆ ఫైలును ఎక్కడో బీరువాలో దాచిపెట్టి ఫైలు కనిపించడం లేదంటూ కాలయాపన చేస్తున్నట్లు తెలిసింది. ఫైలు బయటకు వస్తే నిధులు నేరుగా ఖాతాల్లోకి వెళ్తాయని, అలా అయితే తమకు రావాలసిన లంచం సొమ్ము ఆగిపోతుందని భావించే ఈ బీరువా నాటకం ఆడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీఆర్వోలు, ఎస్‌హెచ్‌జీ
గ్రూపుల హక్కులకు కూడా గండి
గతంలో షాపులు వదిలేసిన వారు, తాత్కాలికంగా విధులు నిర్వహించిన వీఆర్వోలు, అలాగే కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్వయం సహాయక సంఘాల మహిళలకు రావలసిన కమీషన్ నిధులను సైతం అడ్డగోలుగా దారి మళ్లించినట్లు తెలుస్తోంది. అధికారుల సొంత మనుషుల ఖాతాలకు ఈ సొమ్మును బదిలీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లాల విభజన తర్వాత కూడా చౌక దుకాణం డీలర్ల సమస్యలు తీరకపోగా, అధికారులు లంచాల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నారని కొందరు డీలర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, రావాల్సిన కమీషన్ సొమ్మును వెంటనే డీలర్ల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న ఒక కీలక సిబ్బంది ఈ అక్రమాలకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 7 శాతం నుంచి 10శాతం వరకు కమిషన్ వాటా లంచంగా చెల్లిస్తేనే రెండు రోజుల్లో ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని డీలర్లకు బహిరంగంగానే ఆఫర్లు ఇచ్చినట్లు సమాచారం. కొన్ని మండలాల్లో, డీల ర్లు అప్పులు చేసి మరి లంచాలు సమర్పించుకున్నప్పటికీ రూపాయి కూడా ఖాతాల్లో పడలేదని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.


