అన్నదాతలను అవమానించిన టీడీపీ నేతలు ప్రపంచ మామిడి రైతుల దినోత్సవంలో రచ్చరచ్చ ప్రోటోకాల్ తెలియదా.. అంటూ నిర్వాహకులపై మండిపాటు సమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వ ప్రచారపు డప్పు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ప్రపంచ మామిడి రైతుల దినోత్సవం నిర్వహించారు. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతోపాటు రైతు సంఘం నాయకులు, గుజ్జు పరిశ్రమల యజమానులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, పరిష్కార మార్గాలను చూపించాలనే లక్ష్యంతోనే సభను ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ప్రభుత్వ డప్పు కొట్టేందుకే ప్రాధాన్యమిచ్చారు. పైగా అనవసరం వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చి సమావేశ లక్ష్యాన్ని నీరుగార్చేశారు.
ఎమ్మెల్యే డైరెక్షన్‌లో..
టీడీపీ నేతలు రచ్చ చేస్తున్న సన్నివేశాలను సాక్షి కెమెరా చిత్రీకరించడం గమనించిన ఎమ్మెల్యే గురజాల జగనన్‌మోహన్ రంగంలోకి దిగి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సభ అసలు ఉద్దేశమైన రైతుల సమస్యలను గాలికి వదిలేశారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక తాము పడుతున్న కష్టాలను రైతులు వివరించేందుకు యత్నించగా ఎమ్మెల్యే ఏకంగా సినిమా డైరెక్టర్ అవతారమెత్తారు. కట్.. కట్.. అంటూ గద్దిస్తూ ఎవరినీ మాట్లాడనీయకుండా నోళ్లు నొక్కేశారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర రూ.4 ప్రచారాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ రైతుల నిజమైన సమస్యలను తొక్కేశారు. తమిళనాడుకు చెందిన ఓ రైతు నాయకుడు మాట్లాడుతూ మనం బయట మరుగుదొడ్డికి వెళితే కూడా రూ. 5లు ఇచ్చుకోవాలని, అలాంటిది అష్టకష్టాలు పడి పండించే కేజీ మామిడికి రూ.2లు ఇవ్వడమంటే బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో అలాంటి మాటలొద్దని సదరు తమిళ రైతు సంఘ నాయకుడి గొంతును సైతం నొక్కేశారు. ,చివరగా ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, మురళీమోహన్ మాట్లాడుతూ తోతాపురి ఒక్కటే వేస్తే లాభం ఉండదని తేల్చేశారు. దాన్ని కట్ చేసి బేనీషా, ఖాదర్ రకాలను జోడించండని సలహా పడేశారు. ప్రజల్లో మామిడి జ్యూస్ వినియోగం పెంచితే మరింత మంచిదని సూచనలు గుప్పించారు. ఈ క్రమంలోనే మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని ముక్తాయించారు. సమావేశంలో చుడా చైర్మన్ కఠారి హేమలత, పరిశ్రమల ప్రతినిధులు గోవర్ధన్ బాబీ, రఘురామ్ చౌదరి పాల్గొన్నారు.
మమ్మల్ని కాదని.. వాళ్లని పిలుస్తారా..?
ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. ప్రతి విషయంలోనూ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసే చంద్రబాబు బాటలోనే తెలుగు తమ్ముళ్లు నడుస్తున్నారు. సభ ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా.. పాలిటిక్స్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం చిత్తూరులో నిర్వహించిన మామిడి రైతుల దినోత్సవంలోనూ పచ్చపైత్యం ప్రదర్శించారు. నిర్వాహకులు పిలవడంతో ముందుగా వేదికపైకి వెళ్లిన అన్నదాతలను దారుణంగా అవమానించారు. తమ పార్టీ పెద్దలను తొలుత ఆహ్వానించలేదనే సాకుతో రచ్చ రచ్చ చేసేశారు. కష్టాలను చెప్పుకోబోయిన రైతుల గొంతునొక్కేశారు. అసలు సమస్యలను గాలికి వదిలేసి ప్రోటోకాల్ పేరుతో దుర్మార్గంగా వ్యవహరించారు.
సభ ఆరంభంలో నిర్వాహకులు ఎంతో గౌరవంతో రైతు సంఘ పెద్దలు, గుజ్జు ఫ్యాక్టరీల యజమానులను వేదికపైకి ఆహ్వానించారు. అయితే రైతులకు ప్రాధాన్యం ఇవ్వడం చూసి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. మీకు ప్రోటోకాల్ తెలియదా? మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఇతర ముఖ్య నేతలను కాదని వీళ్లను ముందు ఎలా పిలుస్తారు? అంటూ టీడీపీ నాయకులు సురేష్, కాజూరు బాలాజీ, నీరాజాక్షులు నాయుడు రచ్చ మొదలుపెట్టారు. వేదికపైకి వెళ్లి మరీ కాజూరు బాలాజీ మైకు గుంజుకున్నారు. రైతులకు రూ.4 ప్రోత్సాహక నిధి ఇస్తోంది టీడీపీ ప్రభుత్వమా? లేక ఈ గుజ్జు ఫ్యాక్టరీలా? అంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు.


