కార్వేటినగరం : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పేదలకు న్యాయం జరుగుతుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. బుధవారం తమిళనాడులోని వేలాంగణిలో మేరీ మాత లూథరన్ చర్చిని సందర్శించారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రయోజన పాలన రావాలని వేడుకున్నట్లు వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మేలు చేయాలంటే జగనన్న అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. నిస్వార్థ సేవే లక్ష్యంగా గతంలో జగనన్న పాలన సాగించారని వెల్లడించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు అవసరమైన పథకాలను ప్రవేశ పెట్టి వెన్నదన్నుగా నిలిచారని కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపించారు. ప్రస్తుతం సాగుతున్న అరాచకాలు, మోసాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసి బానిసత్వ భావనను తుడిచి పెట్టిన ఏకై క నేత జగనన్న అని స్పష్టం చేశారు.


