చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు అందించనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. బుధవారం జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఈ మేరకు ఏడుగురు ఫిజియోథెరపిస్టులకు నియామకపత్రాలు అందజేశారు. ఏపీసీ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అందుకే ఖాళీగా ఉన్న ఏడు ఫిజియోథెరపిస్ట్ పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని దివ్యాంగ పిల్లలకు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని తెలిపారు. దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా ఐఈ కో–ఆర్డినేటర్ మధు, సూపరింటెండెంట్ కుమార్ పాల్గొన్నారు.


