తీవ్రమైన ఓటు పోరు | - | Sakshi
Sakshi News home page

తీవ్రమైన ఓటు పోరు

Jul 10 2026 5:40 AM | Updated on Jul 10 2026 5:40 AM

● ఊరా? పట్టణమా తేల్చుకోలేకపోతున్న వలస ఓటర్లు ● ఇళ్లల్లో మొదలైన ఓటు పంచాయితీ ● ఓటర్లపై రాజకీయ నేతల ఒత్తిళ్లు ● వలస ఓటర్లతో బీఎల్వోలకు కొత్త చిక్కులు

చిత్తూరు నగరంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన రామాంజనేయులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వలస వెళ్లాడు. అతను రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నాడు. ప్రస్తుత సర్‌ ప్రక్రియలో అతనికి ఏదో ఒక ఓటును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఓటు ఉంచుకోవాలో తేల్చుకోలేక మథనపడుతున్నాడు. ఇలాంటి లక్షలాది మంది వలస ఓటర్ల పరిస్థితి ప్రస్తుతం కత్తిమీద సాములా మారింది. ఈ సమస్యపై సాక్షి స్పెషల్‌ కథనం.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓటు హక్కు ఉండడానికి వీల్లేదని ఎన్నికల సంఘం నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఓటర్లలో తీవ్ర గందరగోళం మొదలైంది. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) సర్వే ఉమ్మడి కుటుంబాలు, వలస ఓటర్లలో తీవ్ర గందరగోళాన్ని రేపుతోంది. జిల్లాలోని చిత్తూరు నగరపాలక, మున్సిపాలిటీలు, మండలాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఓటు ఎక్కడ ఉంచుకోవాలి?’ అనే చర్చే నడుస్తోంది. పట్టణాలు, పల్లెల్లో ఓట్లు ఉన్నవారు తమ ఓటు హక్కును ఎక్కడ వదులుకోవాలో తేల్చుకోలేక సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు.

ఓటర్లపై నేతల ఒత్తిడి..

గెలుపోటములపై గుబులు!

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 13,40,126 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.20 లక్షల మంఇ వలస ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఈ డబుల్‌ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల నుంచి స్థానిక సంస్థల (సర్పంచ్‌, వార్డు మెంబర్‌, కౌన్సిలర్‌) ఎన్నికల వరకు వలస ఓటర్ల ఓటింగే గెలుపోటములను నిర్ణయిస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 15 నుంచి 20 వేల మంది వలస ఓటర్లు ఉంటారని అంచనా. గత ఎన్నికల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె ఇతర పట్టణాల్లో ఉంటూ పోలింగ్‌ రోజు సొంతూళ్లకు వచ్చి ఓట్లు వేసి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డబుల్‌ ఓట్ల తొలగింపు ముమ్మరం కావడంతో ‘మా దగ్గరే ఓటు ఉంచుకోండి’ అంటూ ఇటు మున్సిపల్‌ నేతలు, అటు గ్రామీణ నేతలు ఓటర్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు.

బీఎల్వోలకు కొత్త చిక్కులు

క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న బీఎల్వోలకు ఈ వలస ఓటర్ల వల్ల పెద్ద గందరగోళం ఎదురవుతోంది. గత గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్‌ శాతం ఆధారంగా ఎస్‌ఐఆర్‌ ఫారాల పంపిణీ పూర్తి చేసినప్పటికీ, వాటిపై ఓటర్ల ఫోన్‌ నంబర్లు లేకపోవడం సమస్యగా మారింది. అధికారులు ఇళ్లకు వెళ్లేసరికి చాలామంది వలస ఓటర్లు అక్కడ ఉండడం లేదు. కొందరైతే ఇళ్లు అమ్ముకుని వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో ఏం చేయాలో తెలియక బీఎల్వోలు ఆ ఫారాలను తమ వద్దే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ రెండు చోట్ల ఓట్లు ఉన్న వారిని, అటు నాయకులను తీవ్ర ఇరకాటంలో పడేసింది.

కుటుంబాల్లోనూ వాదోపవాదాలు

ఎస్‌ఐఆర్‌ (సర్‌) ప్రక్రియ ఇప్పుడు ఇళ్లల్లో రాజ కీయ సమస్యగా మారింది. పట్టణాల్లో నివసిస్తు న్న కుటుంబాల్లోని భార్యాభర్తల మధ్య కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. కొందరు ఓటు సొంతూళ్లలోనే (సెంటిమెంట్‌, చుట్టరికం, పరువు కోసం) ఉండాలని భావిస్తుండగా.. మరికొందరు పిల్లల చదువులు, భవిష్యత్‌ స్థానికత, రేషన్‌ కార్డులు, ప్రభుత్వ ఆఫర్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం ఉంటున్న పట్టణ పరిధిలోనే ఓటు ఉంచుకుందామని వాదిస్తున్నారు. ‘ఊర్లో ఓటు తీసేస్తే చుట్టరికం, పల్లెల్లో పరువు పోతుంది’ అనే ఆందోళన కూడా ఓటర్లలో వ్యక్తమవుతోంది.

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) సర్వేతో ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండకూడదనే నిబంధనతో వసల జీవులు నలిగిపోతున్నారు. సొంత గ్రామంలోని ఓటు తొలగిపోతే అది సామాజిక బంధాలు, రేపటి గుర్తింపును శాసించే అవకాశం పోతుందని, ఉన్నచోట ఓటును తొలగిస్తే గుర్తింపును పోగొట్టుకున్నట్టేనని భావిస్తున్నారు. ఈ క్రమంలో సొంతూరులోనా.. లేక ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనా..? ఓటు ఎక్కడ ఉంచుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడే ఓటు ఉంచుకోవాలని రాజకీయ నేతలు ఒత్తిడి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement