చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్యాస్ కొరత అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఇన్‌చార్జి కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో ప్రస్తుతం 42 గ్యాస్ ఏజెన్సీలున్నాయిని, దాదాపు 16 వేల సిలిండర్లు బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.వినియోగదారులు బుక్ చేసిన 48 గంటల లోపే సిలిండర్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. సరఫరా వ్యవస్థను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. గ్యాస్ పంపిణీలో అవకతవకలు జరగకుండా ప్రతి ఏజెన్సీ వద్ద ప్రత్యేక అధికారులను నియమించినట్లు వెల్లడించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఎదురైతే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08572–242734కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అయితే వినియోగదారులు కూడా అవసరం ఉన్నప్పుడు మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు.


