రోడ్డెక్కిన రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు హామీలు అమలు చేయాలంటూ ఆగ్రహం రాస్తారోకోతో నిలిచిన వాహనాలు కలెక్టర్ హామీతో ధర్నా విరమణ
నగరి : ఆరుగాలం శ్రమించి చెరుకు పంట సాగు చేసిన రైతులకు ఆరేళ్లుగా చెరుకు ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన బకాయిలు అందకపోవడం, విన్నవించుకుంటున్నా జిల్లా స్థాయి అధికారులు న్యాయం చెయ్యకపోవడం, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి, ఎమ్మెల్యే వాటిని నెరవేర్చకపోవడంతో ఆగ్రహించిన నేటమ్స్ షుగర్స్ రైతులు, కార్మికులు శనివారం రోడ్డెక్కారు. మండల కేంద్రమైన నిండ్ర నేటమ్స్ షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు రోడ్డుపై బైఠాయించారు. ఆరేళ్లుగా ఆర్థికంగా చితికిపోయిన వారి ఆవేదన ఆందోళనగా పెల్లుబికింది. మాకు న్యాయం జరిగేదెప్పుడు? మా గోడు వినేదెవరు అంటూ భారీ ఎత్తున ఆందోళన చేశారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎస్పీ, సీపీఎం నాయకులు మద్దతు పలికారు.
బకాయిలు చెల్లించాలి
ఈ సందర్భంగా చెరుకు సంఘ నాయకులు, కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ.. 2019–20 సంవత్సరంలో క్రషింగ్ సీజన్‌లో చెరుకు సరఫరా చేసిన 10150 మంది రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.37 కోట్లు బకాయి పడిందన్నారు. అలాగే ఫ్యాక్టరీ కార్మికులు 298 మందికి చెల్లించాల్సిన బకాయిలు రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఆరేళ్లుగా రావలసిన డబ్బులు రాక ఆర్థికంగా చితికిపోయామన్నారు. కొందరు రైతులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. పలువురు రైతులు భూములు అమ్ముకొని రైతు కూలీలుగా మారారన్నారు. అప్పులు చేసి పుస్తెలు అమ్ముకున్నవారు ఉన్నారన్నారు. తీవ్ర ఆవేదనకు లోనై అనారోగ్యం పాలై చనిపోయిన రైతులున్నారన్నారు. ఇలా నేటమ్స్ షుగర్ ప్యాక్టరీకి ఆరేళ్ల క్రితం చెరుకు తోలిన రైతుల బాధలు వర్ణనాతీతమన్నారు.
హామీలు ఏమయ్యాయి బాబూ ?
‘నిండ్రలో నేటమ్స్ షుగర్స్ మూతపడింది. దానిని తెరిచే బాధ్యత తీసుకుంటాం’... షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో పుత్తూరు బహిరంగ సభలో హామీ ఇచ్చారన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే బకాయిలు ఇప్పించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలు ఏౖమయ్యాయని పశ్నించారు. నగరికి ముఖ్యమంత్రి విచ్చేసిన సమయంలో ఆయనను కలవడానికి అపాయింట్‌మెంట్ దొరక లేదన్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళనలు తప్పవన్నారు. రాస్తారోకో చేస్తూ తిరుపతి–చైన్నె రహదారిపై బైఠాయించారు. దీంతో సుదూరం వరకు ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి.
సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు
రోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో సంఘటనా స్థలానికి పరుగు పరుగున అధికారులు విచ్చేశారు. రూరల్ సీఐ భాస్కర్, తహసీల్దార్ ఈశ్వర్, జిల్లా షుగర్ క్రేన్ కమిషనర్ ముత్యాల నాయుడు రైతుల వద్దకు వచ్చి వారితో చర్చించారు. సమస్య తీరే వరకు లేవమంటూ రైతులు భీష్మించుకొని కూర్చొవడంతో వారి చర్యలు విఫలమయ్యాయి. గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో తహసీల్దార్ జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించగా ఆయన రైతు నాయకులతో మాట్లాడారు.
నిరసనకారులతో చర్చిస్తున్న అధికారులు
రహదారికి అడ్డంగా పడుకున్న రూ.కోటి బకాయి రావాల్సిన రైతు సోము
కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆందోళనకారులతో మాట్లాడుతూ.. చెరుకు రైతుల బకాయిలు, కార్మికుల బకాయిల విషయమై గతంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటకు వచ్చే సమయంలో ఆయనతో నేరుగా చర్చించేందుకు అపాయింట్‌మెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు. కర్మాగారంలో ఉన్న స్క్రాప్, ఇనుప సామానులు వేలం వేసి వచ్చే రాబడిని రైతులు, కార్మికులకు చెల్లిస్తామన్నారు. ఈ విషయమై చర్చించేందుకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తనను కలవాలన్నారు. దీంతో శాంతించిన రైతులు, కార్మికులు ఆందోళన విరమించారు. ఆపై పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. కార్యక్రమంలో చెరుకు రైతు సంఘ నాయకులు నారాయణస్వామి రెడ్డి, శ్రీనివాస యాదవ్, పట్టాభిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్, బీఎస్పీ పార్టీ నాయకులు నాగూర్, కార్మికనాయకులు భాస్కర్‌రెడ్డి, నరసింహులు, హేమలత,సంపత్‌కుమార్, మణి, తోయజాక్ష, బాబురెడ్డి, చంద్రశేఖర్‌రాజు, శేఖర్, సుదర్శననాయుడు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు.


