చిత్తూరు అర్బన్ : న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి రాజీమార్గం ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ ను చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా జడ్జి ప్రారంభించారు. లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించు కున్న తరువాత దీనిపై అిప్పీలు వెళ్లడానికి వీలుండదని.. ఇదే అంతిమ తీర్పన్నారు. అదాలత్ కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో కలిపి 35 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలికంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి అదాలత్ ఒకటే మార్గం అన్నారు. జాతీయ లోక్ అదాలత్ కోసం చిత్తూరు, తిరుపతి, మదనపల్లి ప్రాంతాల్లోని న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలంటే.. అదాలత్ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు అవార్డు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు భారతి, శ్రీదేవి, ఉమాదేవి, శ్రీనివాసరావు, శిల్ప, బాబాజాన్, చిత్తూరు న్యాయవాదు ల సంఘం అధ్యక్షులు శంకర్ నాయుడు పాల్గొన్నారు.


