ఇసుక..మస్కా! | - | Sakshi
Sakshi News home page

ఇసుక..మస్కా!

Jan 30 2026 7:00 AM | Updated on Jan 30 2026 7:00 AM

ఇసుక.

ఇసుక..మస్కా!

దర్జాగా సరిహద్దు దాటిస్తున్న స్మగ్లర్లు చిత్తూరు మీదుగా భారీగా చేరవేత పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరులో డంపింగ్‌ టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే..

గంగాధరనెల్లూరులోని నీవా నది పరివాహక ప్రాంతంలో ఇసుక తరలింపు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: జిల్లాలో ఇసుక దోపిడీ మూడు ట్రాక్టర్లు.. ఆరు టిప్పర్లుగా వర్థిల్లుతోంది. టీడీపీ తోడేళ్లు సై ఖతం చేస్తున్నాయి. చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు కేంద్రంగా దందాను నడిపిస్తున్నాయి. వంకలు, వాగులు, నదుల్లో ఇష్టారీతీన తోడేస్తున్నాయి. డంప్‌ చేసి దర్జాగా సరిహద్దు దాటిస్తున్నాయి. రేయింబవళ్లు ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల్లో తమిళనాడుకు రవాణా చేస్తున్నాయి. రోజూ రూ.కోట్లల్లో ఇసుక వ్యాపారం జరుగుతుందంటే దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ప్రజాప్రతినిధుల కన్నసన్నల్లో జరిగే ఈ దందాను సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చిత్తూరులో...

చిత్తూరు మండలంలోని ఆనగల్లు, ముత్తుకూరు, బీఎన్‌ఆర్‌పేట వంకల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడి నుంచి ట్రాక్టర్లలో ఇసుక తరలించుకుని పలు చోట్ల డంప్‌ చేసుకుంటున్నారు. ముత్తుకూరు వద్ద డంప్‌ను రెండు రోజుల క్రితం పోలీసులు, రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీని పై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. తుమ్మింద అడవిచేనులో ఓ టీడీపీ నాయకుడు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇంటి వద్దే డంప్‌ చేసుకుని తమిళనాడుకు విక్రయిస్తున్నాడు. గుడిపాల మండలంలో మంచినీళ్లకుంట, సీఎం కండ్రిగ వద్ద డంప్‌లు ఆకాశనంటేలా ఉన్నాయి. ఈ డంప్‌లు ఆ మండలంలోని ఇద్దరు నేతలకు కోట్లాది రూపాయలు తెచ్చిపెడుతున్నాయి. బహిరంగంగా తమిళనాడుకు పంపుతున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

గతనెల గుడిపాల నుంచి తమిళనాడుకు వెళుతున్న ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. చోటా టీడీపీ నేతపై కేసు నమోదు చేయించారు. అయితే ఇదంతా ఇద్దరు నేతలే దగ్గరుండి చేయించారని.. పట్టుబడ్డ టీడీపీ నేత భగ్గుమన్నాడు. ఆ ఇద్దరు నేతల అక్రమ రవాణాకు తాను అడ్డుగా ఉన్నానని దగ్గరుండి ఇసుకను పట్టించారని మండిపడ్డాడు. కానీ ఆ ఇద్దరు నేతలు కలిసి టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తుంటే అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

చిత్తూరు నగరం గంగసాగరం వద్ద మంగళవారం రాత్రి రెండు ఇసుక లారీలను చిత్తూరు తాలూకా ఎస్‌ఐ పట్టుకున్నారు. పట్టుబడ్డ లారీలను గుడిపాల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పూతలపట్టు మండలం, వావిల్‌తోటలో నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు జరిపి..గుడిపాల మీదుగా తమిళనాడుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇదంతా మురకంబట్టు 50వార్డుకు చెందిన ఓ టీడీపీ నేత కన్నసన్నల్లో జరుగుతుండడంతో కేసు నమోదుకు పోలీసులు వెనకడుగు వేశారు. ఇటీవల టీడీపీ తరఫు ఓ కార్పొరేషన్‌ పదవిని దక్కించుకున్న ఓ నేత ఈ దొంగ రవాణాకు కాపు కాస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులపై ఒత్తిడి తేవడంతో ఇంత వరకు కేసు నమోదు కాలేదు. గుడిపాల పోలీసులు, తాలూకా పోలీసులు ఎవరికి వారు తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారు.

యథేచ్ఛగా ఇసుక దోపిడీ

గంగాధర నెల్లూరులో ట్రాక్టర్లల్లోనే...

గంగాధరనెల్లూరు మండలం నీవానది పరివాహక ప్రాంతమైన కొట్రకోన, గారంపల్లి, కలిజవేడు, వేల్కూరు, ముక్కళ్లత్తూరు, ఎల్లపల్లి నుంచి ఇసుక ను కొల్లగొడుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండ ఉండడంతో కూటమి నేతలు దర్జాగా తవ్వేస్తున్నా రు. పట్టువదలకుండా తమిళనాడు బాట పట్టేస్తున్నారు. ట్రాక్టర్లల్లోనే తూగుండ్రం మీదుగా తమిళనాడులోని పోన్నైకు పంపుతున్నారు. మరో వైపు నీవానది పరివాహక ప్రాంతాల నుంచి పాలసముద్రం, బలిజకండ్రిగ మీదుగా తమిళనాడులోని తిరు త్తణి, సోలింగరం వయా చైన్నెకి తీసుకెళ్లిపోతున్నారు. ఈ విషయం తెలిసినా మైనింగ్‌, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పోలీసులు పట్టించుకుంటే తప్ప అక్రమ ఇసుక వ్యాపారం బట్టబయలు కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు పట్టుకున్నా.. వారిపై ఒత్తిడి పెరుగుతోంది. కేసులు పెట్టకుండా వదిలేయాలని హుక్కుం జారీ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు జంకుతున్నారు. జిల్లా నుంచి తరలుతున్న లారీ లోడ్డు ఇసుక రూ.1.2 లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకు పలుకుతోంది. ఈ లెక్కన్న రోజూవారీగా రూ. కోట్లు విలువ చేసే తమిళనాడుకు తరలుతోంది. కూటమి నేతలకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ దందాను పట్టించుకుని, అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇసుక..మస్కా! 1
1/1

ఇసుక..మస్కా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement