పశుపోషణతో అధిక ఆదాయం
ఐరాల: వ్యవసాయంతో పాటు పశుపోషణ చేపడితే అధిక ఆదాయం పొందవచ్చని విజయవాడ జాయింట్ డైరెక్టర్, స్టాటిస్టిక్స్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం మండంలోని పుత్రమద్దిలో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య ఆరోగ్య శిబిరాలను జిల్లా అబ్జర్వర్‌గా డాక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పశు పోషకులకు శాసీ్త్రయ పశు యాజమాన్యంపై అవగాహన కల్పించాలన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పేయ దూడలు జన్మించే ఫలం ఇంజెక్షన్ రూ.150కు అన్ని ప్రభుత్వ పశు వైద్యశాలలో అందుబాటులో ఉందని, 50 శాతం సబ్సిడీతో అందిస్తామన్నారు. జిల్లా డీడీ ఆరీఫ్ మాట్లాడుతూ జీవాలకు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం 42 ఆవులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు, 184 ఆవులు, దూడలకు, 43 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును తాపించారు. పశు వైద్యాధికారులు రెడ్డెప్ప, పినాకపాణి, పశు వైద్య సహాయ సిబ్బంది పాల్గొన్నారు.


