ఆపసోపాలొద్దు.. ఆన్‌లైనే ముద్దు!
– ఆన్‌లైన్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన అర్జీదారులు సమస్యల పరిష్కారం కోసం నిత్యం కలెక్టరేట్‌కు విచ్చేస్తుంటారు. అనేక అష్టకష్టాలు ఎదుర్కొంటుంటారు. ఇలాంటివారికి స్వాంతన చెందేలా ప్రజలు ఆన్‌లైన్‌లో, టోల్‌ఫ్రీలో కూడా ఫిర్యాదులు అందజేయవచ్చు. ఇది ముందు నుంచి ఉన్నా.. దీనిపై అవగాహన కల్పించడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ప్రజలు ఆప సోపాలు పడి కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు.
ఎలా నమోదు చేయాలంటే..!
మొదటగా www. pfrr.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు అందజేయవ చ్చు. అనంతరం రసీదు సైతం పొందవచ్చు. పీజీఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి హోంను క్లిక్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత సిటిజన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆధార్ నంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దాంతో లాగిన్ కావాలి. ఫిర్యాదు వ్యక్తిగతమా లేక సమాజానికి సంబంధించినదో తెలియజేయాలి. ఫిర్యాదు చేయగానే సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారికి చేరుతుంది. గొడవలు, నేరాలకు సంబంధించినవైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. విచారణ చేసి నిర్ధేశిత గడువులోపు అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది.
టోల్ ఫ్రీ నంబరు సైతం
సమస్యలు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ సైతం అందుబాటులో ఉంది. 1100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేస్తే వారు ఫిర్యాదును స్వీకరిస్తారు. తర్వాత తగిన చర్యలు తీసుకునేందుకు విచారణ నిర్వహిస్తారు.


