భూ ధరల పెంపు
ఫిబ్రవరి 1 నుంచి అమలు
చిత్తూరు కార్పొరేషన్: చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బాదుడే బాదుడు అన్నట్లుగా తయారైంది. ఇప్పటికే పలు చార్జీలను పెంచి, ప్రజల నెత్తిన భారం మోపిన సర్కారు.. ఇప్పుడు భూముల ధరలు మరో సారి పెంచేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త చార్జీల అమలకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదించిన ధరలను మార్కెట్ రివిజన్ కమిటీ ఆమోదించింది. తదుపరి అధికారికంగా ఫిబ్రవరి 1 నుంచి దాదాపు ఇవి అమలు కానున్నాయి. వీటి పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29లోపు తెలపాలని అధికారులు అంటున్నారు.
2 నుంచి కొత్త ధరలు
భూ ధరల పెంపుపై ప్రభుత్వం తొలుత అస్పష్టంగా ఆదేశాలిచ్చింది. మొదట పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రమే ధరలు పెరుగుదల ఉంటుందని తెలిపింది. వాటిలో విలీనమైన గ్రామాలు, వ్యవసాయ భూముల ధరల పై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు అర్బన్ ప్రాంతాలతో కలిపిన ప్రాంతాలనింటికీ అని ఉత్తర్వులు రావడంతో గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో ధరలు పెరగనున్నాయి. వీటితో పాటు వ్యవసాయ భూ ధరలు కూడా పెరగనున్నాయి. ప్రతిపాదించిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి లాంఛనంగా అమలు కానున్నాయి. ఆ రోజు ఆదివారం సెలవు రోజు కావడంతో 2 నుంచి ఽకొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి.
పెంచేశారు!
జిల్లాలోని చుడా, పీకేఎం ఉడా పరిధిలోని అన్ని భూ విలువలు పెరగనున్నాయి. ఉదాహరణకు జీడీనెల్లూరు, కాణిపాకం, పట్నం, పలమనేరు ప్రాంతాల్లో రూ.5 లక్షల లోపు ఉండే ఎకరా భూమి ఇక రూ.5 లక్షలుగా నిర్దేశిత ధరగా నిర్ణయించారు. అలాగే ఎకరా రూ.5 లక్షల పైగా ఉండే భూమి విలువ 30 శాతం వరకు పెంచనున్నారు. అలాగే నగర, పట్టణ ప్రాంతాల్లో నివాస, వాణిజ్య చదరపు అడుగు విలువ 20 శాతం వరకు పెంచనున్నారు. ఎకరా స్థలం రూ.10 లక్షలు అనుకుంటే 30 శాతం పెంపుతో రూ.13 లక్షలు కానుంది. అలాగే ఇంటి స్థలం ఽవెయ్యి అడుగల ధర రూ.20 లక్షలు అనుకుంటే ప్రస్తుతం సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్‌కు రూ.1.5 లక్షలు చెల్లించాలి. పెరగనున్న ధరల ప్రకారం 20 శాతం హెచ్చుతో రూ.1.8 లక్షలు కట్టాలి. అదనంగా మరో రూ.30 వేలు రిజిస్ట్రేషన్ చార్జీలు భూ ధరల పై రూ.4 లక్షలు పెరుగుతుంది.
కనిపించని మార్కెట్ విలువ
ధరల పెంపు ప్రతిపాదిత వివరాలను ముందుగా సంబంధిత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నందు నోటీసుబోర్డులో ప్రదర్శించాలి. అదే విధంగా ఆన్‌లైన్ సైతం పెట్టాలి. కానీ ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ధరల ప్రతిపాదిత వివరాలను పెట్టలేదు. పేరుకే కార్యాలయాల్లో ప్రదర్శిస్తామని అధికారులు చెప్పుకుంటున్నారు. ధరల పెంపుదల అని తెలియడంతో రిజిస్ట్రేషన్ల తాకిడి పెరిగింది.


