కోటి సంతకాల సేకరణ విజయవంతం
రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత స్పందన పుంగనూరులో వందశాతం పూర్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుపతి మారుతీనగర్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందన్నారు. ఇప్పటికే పుంగనూరు నియోజకవర్గంలో వందశాతం సంతకాల సేకరణ పూర్తి చేశామని తెలిపారు. అన్ని నియోజక వర్గాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అన్నివర్గాలవారు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. టీడీపీకి ఓట్లేసిన వారితోపాటు ఆ పార్టీ సానుభూతిపరులు సైతం కోటి సంతకాల సేకరణలో పాల్గొనడం విశేషమని తెలిపారు.
పేద విద్యార్థుల కోసమే..
వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కలలు సాకారం చేసేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నెలకొల్పారని తెలిపారు. చాలా చోట్ల 60 నుంచి 70 శాతం నిర్మాణ పనులు సైతం పూర్తి చేశామని చెప్పారు. దీంతో వేలాదిమంది పేదలు తమ బిడ్డలు డాక్టర్లవుతారని ఆశించారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లేందుకు తెగబడిందని మండిపడ్డారు. మదనపల్లెలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.70కోట్లు వెచ్చించారని, ఇప్పటి వరకు రూ.27 కోట్ల బిల్లులు సైతం చెల్లించారని వివరించారు. అయితే ప్రజా సంక్షేమం పట్టని కొంతమంది కూటమి నేతలు ఆ కాలేజీపై అవాకులు చెవాకులు మాట్లాడుతుంటారని, అది వారి విజ్ఞతకే వదిలేస్తామని వెల్లడించారు.
టీడీపీవి డైవర్షన్ పాలిటిక్స్
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల అవినీతి పెచ్చుమీరిపోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని విమర్శించారు. అందులో భాగంగా తమపై బుదరజల్లుతున్నారని మండిపడ్డారు. చివరకు సర్పంచ్, అంతకంటే చిన్నస్థాయి వ్యక్తులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారని, వారి మాటలకు పట్టించుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎవరిని అడిగినా తామేంటో చెబుతారన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు కళ్లు తెరిచి ప్రజలకు మేలు చేసేందుకు పనిచేయాలని సూచించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించి, నిర్వహిస్తే పేద విద్యార్థులు వైద్యులయ్యేందుకు అవకాశముంటుందని తెలిపారు.


