
నదుల నిండా నీళ్లు.. మది నిండా కన్నీళ్లు
జిల్లాలోని మిగులు జలాలు తమిళనాడు పాలు
ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఏటా వర్షపు నీరు వృథా
వడిసి పట్టలేక వదిలేస్తున్న నీరు 200 వందల ఎంసీఎఫ్‌టీలు
ప్రాజెక్టుల నిర్మాణాలు ఎప్పటికో?
పూర్తయితే పడమటి గడ్డ సస్యశ్యామలం
గత ఎన్నికల్లో ప్రాజెక్టులు నిర్మిస్తామని మాటిచ్చిన బాబు
గత ఎన్నికల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి కూటమి హామీ
ప్రతి వర్షపు నీటి బొట్టునూ ఒడిసి పడుదాం.. అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం.. ఇదీ చంద్రబాబు నాటి నుంచి నేటి వరకు ఇస్తున్న హామీ. బాబు ప్రకటనలకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి పొంతనేలేదు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలోని పలు చిన్న, చిన్న నదులు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహస్తుండడంతో సుమారు 200 ఎంసీఎఫ్‌టీల నీరు వృథాగా కడలిపాలు కావడమే నిదర్శనం. ఫలితం నదుల నిండా నీళ్లున్నా.. పడమటి వాసి మదినిండా కన్నీళ్లే మిగులుతున్నాయి.
పలమనేరు: జిల్లాలోని పడమటి గడ్డ పలమనేరు నియోజకవర్గంలో చిన్న, చిన్న నదులున్నా సాగు, తాగునీటికి ఈ ప్రాంతవాసులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. నేటీకీ పలమనేరు నియోజకవర్గ వాసులు సాగు, తాగునీటికి బోర్లపైన ఆధారపడాల్సివస్తోంది. నియోజకవర్గంలోని చిన్న నదులు వర్షాలు కురిసిన సమయంలో మాత్రమే ప్రవహస్తుంటాయి. ఈ నదుల నీటిని నిలిపి ఉంచే ప్రయత్నాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుడడంతో నీరంతా వృథా అవుతోంది. కౌండిన్య నదిపై కాలువపల్లి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వైఎస్సార్ జలాశయాన్ని నిర్మించారు. ఆపై వచ్చిన కిరణ్, చంద్రబాబు ప్రభుత్వాలు నియోజకవర్గంలోని మిగిలిన ప్రాజెక్టుల విషయాన్ని గాలికొదిలేశాయి. గత ఎన్నికల్లో పలమనేరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఇద్దరూ కూటమి అధికారంలోకి రాగానే ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మాటిచ్చారు. అయితే నేటికీ వాటి గురించి పట్టించుకోలేదు. దీంతో పలమనేరు నియోజకవర్గంలోని నదుల నీరు వృథాగా పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని మోర్థానా ప్రాజెక్టుకు చేరుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం సశ్యశామలమైనట్టే.
మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు
గత ప్రభుత్వంలో చర్యలు
పలమనేరు నియోజకవర్గంలో కై గల్ నది ప్రాజెక్టు, దుర్గమ్మ ఏరు ప్రాజెక్టు, గంగన్నశిరస్సు ప్రాజెక్టుల నిర్మాణానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బైరెడ్డిపల్లి మండలంలోని కై గల్ నదిపై రూ.22 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పూనుకుంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు చెల్లింపులు జరిగి, టెండర్ల ప్రకియలో పనులు ఆగాయి. వి.కోట మండలంలోని దుర్గమ్మ ఏరు ప్రాజెక్టుకు రూ.46.82 కోట్ల అంచనాలను గతంలోనే ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి పంపారు. పలమనేరు మండలంలోని గంగన్నశిరస్సు ప్రాజెక్టు పనులు గతంలో మొదలై అర్ధంతరంగా ఆగాయి. ఈ విషయమై స్థానిక ఇరిగేషన్‌శాఖ రూ.27.37 కోట్ల కొత్త అంచనాలతో పబ్లిక్‌హెల్త్ శాఖకు పంపింది. అయితే అటవీశాఖ నుంచి క్లియరెన్స్ ఆలస్యమవుతున్నందున ప్రాజెక్టుకు ఇబ్బందికరంగా మారింది. ఇక బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లి నది విషయం కనీసం ఇరిగేషన్ శాఖకు కూడా తెలియదు. మొత్తం మీద ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే గంగనశిరస్సు ప్రాజెక్టులో 55 ఎంసీఎఫ్‌టీ, కై గల్ రిజర్వాయర్ ద్వారా 45.27 టీఎంసీ, దుర్గమ్మ ఏరు ప్రాజెక్టు ద్వారా 56 , వెంగంవారిపల్లి 40 ఎంసీఎఫ్‌టీ మొత్తం ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 200 ఎంసీఎఫ్‌టీ దాకా నీటిని వడిసిపట్టినట్టే. దీంతో సాగు, తాగునీటి కష్టాలు తీరినట్టే.
పలమనేరు మండలం మండపేట కోటూరు
అడవిలో ప్రవహిస్తున్న ఎరిగినేరు
బైరెడ్డిపల్లె మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న కై గల్ నది
వరద నీరు కడలి పాలు!
గత ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చిన చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పలమనేరు నియోజకవర్గంలో ప్రాజెక్టులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు ఏళ్లు పూర్తి అయినా వీటి గురించి పట్టించుకోలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఎక్కడ ఆగాయో అక్కడే ఉన్నాయి. ఈ విషయమై స్థానిక ఇరిగేషన్ అధికారులను(జేఈ లక్ష్మీనారాయణ)ను సంప్రదించగా గంగన్నశిరస్సు ప్రాజెక్టు పనులకు అటవీశాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. కై గల్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉన్నాయన్నారు. దుర్గమ్మ ఏరు ప్రాజెక్టుకు ఆర్థికశాఖ క్లియరెన్స్ రావాల్సి ఉందని తెలిపారు. రెండు ప్రాజెక్టులకు రివైజ్డ్ అంచనాలతో ఇటీవలే అంచనాలను పెంచి ప్రభుత్వానికి పంపామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులు త్వరగా మొదలుపెట్టేందుకు ఫాలోఅప్ చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.
200 ఎంసీఎఫ్‌టీ నీరు సముద్రం లోకే..
పలమనేరు నియోజకవర్గంలో కౌండిన్య, ఎగినేరి, కై గల్, దుర్గమ్మఏరు, వెంగంవారిపల్లి నదులు ముఖ్యమైనవి. వర్షాకాలంలో ఈ నదుల ప్రవహించినపుడు 150 నుంచి 200 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్లు)ల నీరు వృథాగా తమిళనాడు రాష్ట్రం ద్వారా బంగాళాఖాతంలో కలసిపోతోంది. అయితే కౌండిన్య నదిపై రూ. 55 కోట్ల వ్యయంతో పలమనేరు మండలంలోని కాలువపల్లి వద్ద దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రిజర్వాయర్‌ను నిర్మించారు. దీంతో 50 ఎంసీఎఫ్‌టీల నీటిని ఇక్కడ నిల్వ చేసుకోగలిగాం. ప్రస్తుతం నదులకు ఎగువ ప్రాంతాలైన కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో బైరెడ్డిపల్లి మండలంలోని కై గల్ నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీరు కౌండిన్య నదిలో చేరి తమిళనాడులోని మోర్ధనా డ్యామ్‌కు వృథాగా వెళుతోంది. అలాగే పలమనేరు మండలంలోని ఎరగినేరి నది నీరు, వి.కోట మండలంలోని దుర్గమ్మ ఏరు నీరు తమిళనాడుకు చేరుతోంది. బైరెడ్డిపల్లి మండంలోని వెంగంవారిపల్లి అడవిలోని నదుల నుంచి ఏటా 200 ఎంసీఎఫ్‌టీ నీరు సముద్రం పాలవుతోంది.

నదుల నిండా నీళ్లు.. మది నిండా కన్నీళ్లు

నదుల నిండా నీళ్లు.. మది నిండా కన్నీళ్లు