
ఎంపీ నిధులతో ఇంటింటికీ తాగునీరు
– మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
రొంపిచెర్ల: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి నిధులతో తాగునీటి ట్యాంకులు నిర్మించి ఇంటింటికీ అందిస్తామని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. గురువారం రాత్రి రొంపిచెర్ల ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి వెళ్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని ఆయన స్వగృహంలో కలిశారు. మండలంలో తాగునీటి ట్యాంకుల నిర్మాణం పూర్తి అయ్యిందని, కొన్ని చోట్ల నిధుల సమస్య ఉందని ఎంపీపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఎంపీ నిధులను మంజూరు చేస్తామని, వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందించాలని నాయకులను ఆదేశించారు. అలాగే మండలంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యేను కలసిన వారిలో వైస్ ఎంపీపీ విజయశేఖర్, సూర్య నారాయణ రెడ్డి, యుగంధర్ రెడ్డి, హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.