
హే..కృష్ణా!
యథేచ్ఛగా మట్టి, ఇసుక అక్రమ రవాణా వర్షమొచ్చినా వీటిల్లో నీరు చేరని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా జలాలే దిక్కు ఆశగా ఎదురు చూస్తున్న పలమనేరు, కుప్పం రైతులు
అధికార పార్టీ అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వాగులు, వంకలు, చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి, ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా చెరువులు చాలావరకు ధ్వంసమయ్యాయి. వర్షాలు పడినా చెరువుల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు. ఫలితంగా భూగర్భ జలాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ మీదుగా కుప్పం ఉప కాలువకు వస్తున్న కృష్ణా జలాలను పలమనేరు, కుప్పం ప్రాంతాల్లోని చెరువులుకు నింపాల్సి ఉంది. లేనిపక్షంలో జిల్లాలోని పడమటి మండలాలు ఎడారిగా మారే అవకాశం ఉంది.. ఈ క్రమంలో కూటమి నేతలు ఎలా స్పందిస్తారోనని రైతులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు.
పలమనేరు: పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని పలు చెరువులను కూటమి నేతలు చెరబట్టారు. చాలా చెరువుల్లో మట్టి, ఇసుక తవ్వేయడంతో గుంతలమయమయ్యాయి. వర్షాలొచ్చినా నీరు చేరక చెరువులు ఎడారిని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో భూగర్భజలాలు అడుగంటాయి. డివిజన్ పరిధిలో 80 వేల వ్యవసాయ బోర్లుండగా ఇప్పటికే 20 వేల బోర్లలో నీరు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు పడుతున్న వర్షాలతో వర్షపు నీరు చెరువుల్లోని గుంతలు కూడా నిండడం లేదు.
నాలుగు రోజుల్లో కృష్ణా జలాలు
కృష్ణా జలాలు చెర్లోపల్లి రిజర్వాయర్‌కు ఇప్పటికే చేరాయి. అక్కడి నుంచి పుంగనూరు, కుప్పం ఉపకాలువ మీదుగా మరో నాలుగైదు రోజుల్లో పెద్దపంజాణి మండలం, అప్పినపల్లి(224.5కిమీ)కి చేరుకునే అవకాశం ఉంది. ఆపై ఇవి బైరెడ్డిపల్లి, వీకోట మీదుగా కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రంలోకి చేరుకోనున్నాయి.
కూటమి నేతల దెబ్బకు ధ్వంసమైన చెరువులు
ఇక్కడి చెరువుల
అనుసంధానమే లక్ష్యం
హంద్రీ–నీవా– సుజల స్రవంతి పథకంలో భాగంగా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన(కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు) ల్లోని 6,025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగు నీటిని అందించడమే దీని లక్ష్యం. ఇందుకోసం కృష్ణా నది నుంచి 120 టీఎంసీల నీటిని ఇక్కడికి తరలిస్తున్నారు. పుంగనూరు ఉపకాలువ నుంచి 143.9 కి.మీ మేర ప్రయాణించి కుప్పం ఉపకాలువ ద్వారా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాలకు 4.02 లక్షల మందికి తాగునీరు, 110 చెరువులకు సాగునీటిని మళ్లించనున్నారు. ఇక్కడి చెరువుల పరిధిలోని 6,300 ఎకరాల భూములకు సాగునీటిని అందించాలన్నది దీని లక్ష్యంగా నిర్ధేశించారు. దీంతో కృష్ణా జలాలను ఇక్కడి ఎంఐ(మేజర్ ఇరిగేషన్ ట్యాంకులు) చెరువులను నింపాలని రైతులు కోరుతున్నారు.

హే..కృష్ణా!

హే..కృష్ణా!