జిల్లాలో యూరియా నోస్టాక్
పలమనేరు: జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మొన్నటి దాకా కాంప్లెక్స్ కొంటేనే యూరియాను అమ్మిన ఫర్టిలైజర్స్ యజమానులు ఇప్పుడు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. హోల్‌సేల్ కంపెనీల నుంచి డైరెక్ట్‌కా అందే జిల్లాలోని గ్రోమోర్ అవుట్‌లెట్లు, రైతు సమాఖ్య దుకాణాల్లో మాత్రం అప్పుడప్పుడు అందే లోడ్డు యూరియా కోసం వందలాది మంది రైతులు ఎగబడేవారు. వారిని నియంత్రించేందకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేవారు. చాలీ చాలకుండా వచ్చే స్టాకు గంటల వ్యవధిలోనే ఖాళీ అయ్యేది. పలమనేరులో ఓ రైతు సమాఖ్య వారు గురువారం ఓ లోడ్డు యూరియాను తెప్పించారు. రైతులు అక్కడికి వందలాది మంది చేరుకుని క్యూ కట్టారు.
కర్ణాటకలోనూ నోస్టాక్
జిల్లాలో యూరియా లేక ఇప్పటిదాకా రైతులు పొరుగునే ఉన్న కర్ణాటక వెళ్లి యూరియాను తెచ్చుకొనేవారు. కానీ ఇక్కడ నెలకొన డిమాండ్ కారణంగా అక్కడ కూడా యూరియా దొరకడం లేదు. ఉన్న యూరియా అంతా ఆంధ్రావాళ్లకే చాలడం లేదు.. ఇక మా వద్ద స్టాకెక్కడుంటుందనే మాట అక్కడి వ్యాపారుల నుంచి వినిపిస్తోంది.
అమాంతం పెరిగిన ధరలు
స్థానికంగా యూరియా దొకరడం లేదు. దీన్ని అదునుగా చేసుకొని కర్ణాటకకు చెందిన కొందరు వ్యాపారులు యూరియాను ఇక్కడికి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. స్థానికంగా యూరియా బస్తా ధర రూ.270 కాగా అది రూ.300 దాటింది. అంత ధర ఇస్తామన్నా యూరియా దొరడం లేదు. బస్తా రూ.400 నుంచి రూ.500 దాకా పెట్టి అమ్మకాలు చేస్తున్నా యూరియా నిమిషాల్లోనే అయిపోతోంది.
క్యూకట్టిన రైతులు
పలమనేరు ప్రాంతంలో ఇటీవల వర్షాలకు వరి నాట్లు వేశారు. ఇప్పుడు యూరియా వరికి చాలా అవసరం. దీంతోపాటు పశుగ్రాసానికి కూడా అవరసం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో స్థానికంగా యూరియా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి రైతు సమాఖ్య వారు గురువారం ఓ లోడ్డు యూరియాను తెచ్చారు. దీనికోసం వందలాది మంది షాపు తెరవకముందే క్యూ కట్టారు. వీరిని అదుపు చేయలేక స్థానిక పోలీసులు బందోబస్తుకు రావాల్సి వచ్చింది.
జిల్లా సమాచారం
ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం
– 1.70 లక్షల హెక్టార్లు
ఇప్పటిదాకా సాగైన విస్తీర్ణం
– 60వేల హెక్టార్లు
ఈ దఫా వరిసాగు విస్తీర్ణం
– 27వేల హెక్టార్లు
ప్రస్తుతానికి కావాల్సిన యూరియా
– 20వేల బస్తాలు
అందుబాటులో ఉన్న యూరియా
– 2వేల బస్తాలు
గతంలో గ్రామాల్లోనే యూరియా
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారా రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉండేది. కూటమి పాలనలో యూరియా కోసం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు. బస్తా యూరియా కోసం పనీపాట వదలుకొని అవస్థలు పడాల్సి వస్తోంది. వాస్తవంగా బస్తా యూరియా రూ.270. ఇక్కడ లేకపోవడంతో కర్ణాటక నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఖర్చుతో కలిపి మొత్తం బస్తా రూ.350 దాకా ఖర్చుచేయాల్సి వస్తోంది.
– నరసింహారెడ్డి, ఎగువ మారుమూరు, పలమనేరు మండలం
వారంగా తిరుగుతున్నా
ఈ మధ్య కురిసిన వానలతో కొంత పొలంలో వరి సాగుచేశా. ఆ పంట పసుపు రంగులోకి మారింది. ఓ బస్తా యూరియా చల్లాలని వారం రోజులుగా పలమనేరులోని దుకాణాల వద్దకు తిరుగుతున్నా. మొన్నటి దాకా యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాలన్నారు. దానికి కూడా రెడీ అంటున్నా యూరియా దొరకడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు.
– సుబ్బన్న, గొల్లపల్లి, రైతు, పలమనేరు మండలం
యూరియా..లేదయ!
యూరియా..లేదయ!