
వారి కడుపుకొట్టి ఏం సాధిస్తారు బాబూ?
చిత్తూరు కార్పొరేషన్: అడ్డగోలు నిబంధనలతో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమని చిత్తూరు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ బాబు సర్కారుకు తప్పనిసరిగా దివ్యాంగుల ఉసురు తగులుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో కుల మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి పింఛన్ మంజూరైందన్నారు. తాము అధికారంలోకి వస్తే వారికి అదిక పింఛన్ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. నమ్మి ఓట్లేసిన దివ్యాంగులకు ఇప్పుడు నోటీసులు జారీ చేసి పింఛన్ ఎత్తివేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న పింఛన్లకు కోత పెడుతుండడంతో బాధితులకు దిక్కుతోచడం లేదన్నారు. ప్రస్తుతం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లు కోత విధిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో దాదాపు 5వేల మందికి నోటీసులు ఇచ్చారన్నారు. వీరిని అనర్హులుగా తేలుస్తూ వచ్చే నెల నుంచి పింఛన్లు నిలిపివేయనున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రతినెలా ఆహారం, మందులు ఇతర ఖర్చులకు పింఛనే ఆధారమన్నారు. ఇప్పుడు పింఛన్ తొలగిస్తే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు.
అంతర్ జిల్లా బదిలీలకు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ అధికారులు అంతర్ జిల్లా బదిలీలకు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి కసరత్తు చేపడుతున్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ అంతర్ జిల్లా బదిలీలకు అర్హులైన టీచర్లు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ మహిళా జట్ల ఎంపిక రేపు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ మహిళల జట్ల ఎంపిక ఈ నెల 23న ఉంటుందని ఆ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 23న జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి మహిళా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇక్కడ ఎంపికయ్యే క్రీడాకారులు ఈ నెల 30, 31 తేదీల్లో పల్నాడు జిల్లా దూబిపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర సమాచారానికి 9581887409, 7013989059 నంబర్లలో సంప్రదించాలని కోరారు.