
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీ పరీక్షల్లో ఎంపికయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కుల స్కోర్ జాబితాలను ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన విషయం విధితమే. ఈ జాబితాల్లో పలువురు అభ్యర్థుల టెట్ ఫలితాలు తప్పుగా నమోదు కావడంతో సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రోస్టర్, మెరిట్ ఆధారంగా తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో ప్రచురించనున్నారు. ఆ తర్వాత సర్టిఫికెట్ల కసరత్తు నిర్వహించనున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచనల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఇటీవల రాష్ట్ర స్థాయిలో శిక్షణ సైతం పూర్తి చేశారు. ఇక రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.
రెండు ఇంజినీరింగ్ కేంద్రాలు ఎంపిక
చిత్తూరు జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉండే అపోలో యూనివర్సిటీ, ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలను సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ కేంద్రాల్లో అర్హత సాధించే 1,473 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. పరిశీలను 30 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.