
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
వి.కోట : రాష్ట్రంలో అస్సలు ప్రజాస్వామ్యం ఉందా..? అని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ప్రశ్నించారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల తీరుచూస్తే అసలు మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా అన్న అనుమానం వస్తోందని వాపోయారు. గురువారం మండలంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కపాడాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ దారుణమైన పాత్ర పొషించడం దురదృష్టకరమన్నారు. ఎన్నికలు జరిగిన 15 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాల పర్యవేక్షణలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మీరు ప్రజాస్వామ్య బద్ధంగా గెలిసుంటే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
నేడు పంచాయతీల్లో గ్రామసభలు
చిత్తూర కార్పొరేషన్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలను నిర్వహించాలని డీపీఓ సుధాకర్‌రావ్ తెలిపారు. పునరుత్పాదక ఇంధన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, పశుసంవర్థకశాఖ సహకారంతో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించి వాటి సంరక్షణ చర్యలు తీసుకోవడం, పంచాయతీల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంపై ప్రధానంగా గ్రామసభల్లో చర్చించి తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించిందన్నారు.
డీఎస్సీ స్కోర్ కార్డులు
చిత్తూరు కలెక్టరేట్ : సవరించిన టెట్ మార్కులతో డీఎస్సీ అభ్యర్థుల స్కోర్ కార్డులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్టు డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. మెగా డీఎస్సీ తుది కీ, స్కోరు కార్డులను ఇది వరకే విడుదల చేశారన్నారు. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను www.apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. సవరించిన స్కోరు కార్డులను ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని డీఎస్సీ అభ్యర్థులు సరిచూసుకోవాలన్నారు. టెట్ మార్కుల స్కోరు కార్డులో ఏవైనా అభ్యంతరాలున్నట్‌లైతే అభ్యర్థి ఐడీ నెంబర్‌తో వెబ్‌సైట్‌లో సరిచేసుకోవాలని డీఈఓ సూచించారు.