
గజదాడుల కట్టడిలో విఫలం
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
హాజరుకాని అధికార గణం
పేరుకుపోతున్న బకాయిలు
16న జిల్లా పరిషత్ 4వ సర్వసభ్య సమావేశం
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజాసమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చక్కటి వేదిక. ఇందులో అనేక సమస్యలు పరిష్కరించడమే కాకుండా అభివృద్ధి పనులు, కొత్త నిర్ణయాల అమలు పట్ల చర్చించవచ్చు. అయితే ప్రతి సారీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న ఈ సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా సాగుతోంది. ఈ సమావేశం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా పరిధిలో నిర్వహిస్తారు. ఈ మూడు జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు హాజరైతే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే ఇప్పటి వరకు తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు హాజరు కాలేదు. ఆయా జిల్లాల అధికారులు సైతం గైర్హాజరవుతున్నారు. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని జెడ్పీటీసీలు సమావేశానికి హాజరై సమస్యలు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది.
ప్రతిసారీ అజెండాలో తప్పిదాలే
జిల్లా పరిషత్ సర్వసమావేశానికి అందజేసే అజెండాలో అన్ని శాఖల పరిధిలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల సమాచారం పొందుపరచాలి. అయితే అనేక శాఖల అధికారులు అజెండాలో తమ శాఖకు చెందిన సమాచారమే ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 29న నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి అందజేసిన అజెండాలో కేవలం 11 శాఖల సమాచారమే పొందుపరిచారు. ఆ సమాచారంలోనూ అనేక తప్పిదాలున్నాయి. చివరి నిమిషంలో పలు శాఖలు సమాచారం అందజేస్తుండడంతో చాలా తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి.
జాడలేని ఆర్థిక సంఘం నిధులు
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా వేధిస్తోంది. జెడ్పీ, పంచాయతీలకు కలిపి రూ.85 కోట్లు ఇవ్వగా వాటిని పల్లె పాలనకు కేటాయించాల్సి ఉంది. ఆ డబ్బులు మంజూరు చేయకుండా సతాయిస్తోందని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె పండుగ కింద పంచాయతీరాజ్ పరిధిలో రూ3.కోట్ల బిల్లులు రావాల్సి ఉంది.
సెస్ బకాయిలు రూ.36.4 కోట్లు
జిల్లాలోని గ్రంథాలయాలకు నగరపాలక, పంచాయతీల నుంచి వచ్చే సెస్ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, నిర్వహణ కలిపి మొత్తం రూ.80 లక్షలు అవుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సెస్ బకాయిలు రూ.36.40 కోట్లు రావాల్సి ఉంది.
నూతన విద్యుత్ సర్వీసులకు మీనమేషాలు
ఉమ్మడి జిల్లాలో డబ్బులు కట్టించుకొని విద్యుత్ ఇవ్వాల్సిన సర్వీసులు 4 వేలకు పైగా ఉన్నాయి. శాఖా పరంగా కట్టిన డబ్బులకంటే పలుకుబడి, అధికారులకు మామూళ్లు ఇచ్చుకున్నవారికే సర్వీసులు జిల్లా స్టోర్స్ నుంచి త్వరగా విడుదలవుతున్నాయి. అత్యవసర కోటా కింద పరికరాలు తీసుకునే వెసులుబాటు ఉన్నా అవి ఇచ్చిన దాఖలాలు లేవు.
ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.260 కోట్లు
ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు రూ.260 కోట్లకుపైగా ప్రయివేటు ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉంది.
విద్యుత్ బకాయిలు రూ.500 కోట్లు
పలు ప్రభుత్వ శాఖలు, పంచాయతీల పరంగా రూ.500 కోట్ల మేర విద్యుత్ శాఖకు రావాల్సి ఉంది. ఇలాంటి మొండి బకాయిలపై అసలు దృష్టి పెట్టడం లేదు. వీటికి తోడు ఓ వైపు ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు జోరుగా సాగుతోంది.
కాలనీల్లో మౌలిక వసతులు కరువు
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా జగనన్న కాలనీలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ కాలనీల్లో మౌలిక వసతులను కల్పించడంలో అలసత్వం వహిస్తోంది. ఆ కాలనీల వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితులున్నాయి.
వేతనాల కోసం ధర్నా చేస్తున్న గ్రీన్‌అంబాసిడర్లు(ఫైల్)
పరిష్కారం కాని అన్నదాత కష్టాలు
జిల్లాలో అన్నదాతలు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాకు 40,338 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం కాగా 26,350 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. వ్యవసాయ రుణాలు రెన్యూవల్ చేసుకోవాలంటే అప్పటి వరకు ఉన్న మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని కొత్తగా మెలిక పెట్టారు. జిల్లాలో వేలాది మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రూ.3,341 కోట్ల రుణం తీసుకుని అవస్థలు ఎదుర్కొంటున్నారు.
మొక్కుబడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం
ప్రజాప్రతినిధుల జీతాలకే దిక్కులేదు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో జెడ్పీటీసీ, సర్పంచ్‌ల జీతాలకు దిక్కులేదు. ఉమ్మడి జిల్లాలోని 65 మండలా జెడ్పీటీసీలకు నెలకు రూ.6వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ అనేక నెలలుగా ఇవి పెండింగ్‌లో ఉండగా ఇప్పటికి రూ.1.7 కోట్లు రావాల్సి ఉంది. అలాగే సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన రూ.3వేల గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదు. వారికి రూ.1.72 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
మామూళ్ల మత్తులో ఇంజినీరింగ్ శాఖ
ఇంజినీరింగ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. జిల్లా ఆర్‌అండ్‌బీ పరిధిలో 15 ఏఈలకుగాను ముగ్గురే ఉన్నారు. వీరే అన్ని నియోజకవర్గాలను పర్యవేక్షించాల్సి ఉంది. ప్రతి పనికీ పైసలు ఇవ్వనిదే చేయడం లేదని కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్నారు. సంవత్సరాల కాలంగా ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ శాఖలకు ఇన్‌చార్జి ఎస్‌ఈలే దిక్కుగా మారారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో 50 మంది ఏఈలకు 34 మందే ఉన్నారు. ఇక పంచాయతీరాజ్‌లోనూ ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. ఇక్కడ డీఈలు 15 మందికి గాను ఐదుగురు, 62 మంది ఏఈలకు గాను 37 మంది, ఇంజినీర్ సహాయకులు 504కు గాను 90 మంది కొరత ఉన్నారు. ట్రాన్స్‌కోలోనూ 40 మంది ఏఈలకు గాను దాదాపు 12 మంది తక్కువగా ఉన్నారు.
ఫలితం శూన్యం
జెడ్పీ సమావేశాలంటే పలు శాఖల అధికారులకు లెక్క లేకుండా పోయింది. దీనిపై జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు హెచ్చరించినా ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా ఎన్‌హెచ్‌ఎఐ, అటవీశాఖ, విద్యుత్‌శాఖ, డ్వామా, డీఆర్‌డీఎ, డీఎంఅండ్‌హెచ్, విద్యశాఖ అధికారులు రావడం లేదు. సోషల్ మీడియా కోసం రీల్స్ పెట్టడానికి కొందరు వీడియోలు చేస్తూ హడావిడి చేస్తున్నారు.