
తల్లిదండ్రులు మందలించారని!
– ఉరివేసుకుని యువకుడి మృతి
బంగారుపాళెం: మండలంలోని వెలుతురుచేను గ్రామంలో గురువారం ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వెలుతురుచేను గ్రామానికి చెందిన వేలు కుమారుడు ఉపేంద్ర(18) ప్రవర్తన సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అతను మనప్తాపానికి గురై గ్రామ సమీపంలో ఒంటిల్లు వద్ద గల పశువుల పాకలో ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి వేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పొట్టకూటి కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు!
చౌడేపల్లె: కూలి కోసం వెళ్లి ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. వివరాలు.. మండలంలోని చారాలకు చెందిన బాలసుబ్రమణ్యం కుమారుడు రవితేజ(25) ట్రాక్టర్ డ్రై వర్. దుర్గసముద్రం పంచాయతీ, బండమీదపల్లె సమీపంలో గొల్లవానికుంట వద్ద ట్రాక్టర్‌తో మడి దున్నేందుకు వెళ్లాడు. మడిలో దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని పుంగనూరు పభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవితేజ మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ భూములకు యాజమాన్య హక్కు పత్రాలు
తవణంపల్లె: గ్రామ కంఠం భూములకు స్వామిత్వ కార్యక్రమం ద్వారా యాజమాన్య హక్కు పత్రాలను కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు తెలిపారు. గురువారం తవణంపల్లె మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు స్వామిత్వ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీపీఓ సుధాకర్‌రావు పర్యవేక్షించి పలు సూచనలు, సలహాలిచ్చారు. ప్రతి గ్రామంలో గ్రామం కఠం భూములను పారదర్శకంగా సర్వే చేసి అనుభవంలో ఉన్న వారికి యాజమాన్య హక్కు పత్రాలు మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. తర్వాత క్షేత్ర స్థాయిలో ఎగువ తవణంపల్లెలో స్వామిత్వ సర్వే ఎలా చేయాలనే అంశాలపై అవగాహన కల్పించారు. డిప్యూటీ ఎంపీడీఓ మురుగేష్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 28 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 75,859 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

తల్లిదండ్రులు మందలించారని!