
కన్నీటి వీడ్కోలు
గంగాధరనెల్లూరు : మండలంలోని వేపంజేరి పంచాయతీ, గోవిందరెడ్డిపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డికి కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం తిరుత్తణికి వెళ్తుండగా కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో విశ్వనాథరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గురువారం గోవిందరెడ్డిపల్లి గ్రామానికి తీసుకొచ్చారు. నిన్న మొన్నటి వరకు తమ మధ్య సంతోషంగా తిరుగుతున్న వ్యక్తులు దూరమవ్వడంతో గ్రామస్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. విశ్వనాథరెడ్డి తల్లిదండ్రులు, అన్న సురేంద్రారెడ్డిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చుట్టుపక్కల గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి నివాళి అర్పించారు.
పలువురి నివాళి
వైఎస్సార్‌సీపీ గంగధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఎంసీ విజయానందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనగంటి హరికృష్ణ గ్రామానికి చేరుకుని మృతుడు విశ్వనాథరెడ్డికి ఆత్మీయ నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మాజీ సీడీసీఎంఎస్ చైర్మన్ వేల్కూరు బాబురెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, నాయకులు మునిరాజారెడ్డి, చిన్నమ్మరెడ్డి, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు.
తల్లడిల్లిన తిరుమలపల్లి
విశ్వనాథరెడ్డి అన్నకుమార్తె కీర్తి కుమారుడు షాన్విక్‌రెడ్డి(ఏడాది) ప్రమాదంలో మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం విగత జీవిగా గ్రామానికి రావడంతో స్థానికులు తల్లడిల్లిపోయారు. చిన్నారి తండ్రి స్వగ్రామామైన యాదమరి మండలం, తిరుమలపల్లి గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మరో నెలలో చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్న తరుణంలో మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారి తల్లి కీర్తి, అమ్మమ్మలు రాణిపేట సీఎంసీలో చికిత్స పొందుతున్నారు.
విశ్వనాథరెడ్డి మృతదేహానికి నివాళి అర్పిస్తున్న కృపాలక్ష్మి, విలపిస్తున్న సురేంద్రారెడ్డి

కన్నీటి వీడ్కోలు