
సీజ్ చేసిన ఇసుక మాయం!
పాలసముద్రం : మండంలోని బలిజకండ్రిగ సమీపం, తమిళనాడు సరిహద్దులో పోలీసులు సీజ్‌చేసిన ఇసుక మాయమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు సుమారు 100 టిప్పర్లకుపైగా ఇసుకను తమిళనాడు సరిహద్దులో డంప్ చేశారు. ఆపై అక్కడి నుంచి రాత్రికి రాత్రి తరలించి సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించి ఇసుకను సీజ్ చేశారు. అయితే పోలీసుల కన్నుగప్పి టీడీపీ నాయకులు సీజ్ చేసిన ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. కానీ దీనిపై పోలీసులు నోరుమెదపకపోవడం గమనార్హం.
ఆగని గజదాడులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలపై ఏనుగుల దాడులు ఆగడంలేదు. వారం రోజులుగా పాళెం సమీపంలోని చింతల వంకలో తిష్టవేసిన 16 ఏనుగుల గుంపు పగలు అక్కడే ఉండి రాత్రిపూట పంటలను నాశనం చేస్తున్నాయి. గురువారం తెల్ల వారుజామున ఏనుగుల గుంపు పాళెం పంచాయతీలోని కోటపల్లె, కల్లూరు సమీపం సైదుల్లా గుట్ట వద్ద ఉన్న పంట పొలాలను నాశనం చేశాయి. మామిడి చెట్లను పెరికి వేయడం, కొమ్మలు విరిచేయడం, కొబ్బరి చెట్లను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉదయం వరకు ఏనుగుల గుంపు పంట పొలాల్లోనే తచ్చాడుతుండడంతో అన్నదాతలు అటువైపు వెళ్లలేని పరిస్థితి.
ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవానికి సర్పంచ్ భాగ్యవతి
చౌడేపల్లె: ఢిల్లీలో జరగబోయే స్వాతంత్య్ర దినోత్సవానికి గడ్డంవారిపల్లె సర్పంచ్ భాగ్యవతికి ఆహ్వానం అందింది. గురువారం జలశక్తి అభియాన్ మంత్రి మండళి ఆహ్వానం మేరకు భాగ్యవతి దంపతులు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అక్కడ జరగబోయే స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. గడ్డంవారిపల్లె పంచాయతీ పరిధిలో జరిగిన వాటర్‌షెడ్ పథకం అమలులో భాగంగా ఉత్తమ సేవలకు గాను ఈ ఆహ్వానం అందినట్టు పేర్కొన్నారు.

సీజ్ చేసిన ఇసుక మాయం!

సీజ్ చేసిన ఇసుక మాయం!