
మళ్లీ వాళ్లే!
పంద్రాగస్టున చేంతాడంత ఉత్తమ
ఉద్యోగుల జాబితా
ప్రతి ఏటా కొందరినే వరిస్తున్న అవార్డులు
రిటైర్డ్ అవుతున్నా గుర్తింపు లభించక కుమిలిపోతున్న పలువురు ఉద్యోగులు
ఉద్యోగుల ఎంపికలో ‘పచ్చ’ సిఫార్సులు, వ్యక్తిగత విధేయత
చిత్తూరు అర్బన్: ‘ఏం చెప్పేదయ్యా..! అటెండరుగా 38 ఏళ్ల క్రితం మునిసిపాలిటీలో చేరాను. ఈ నెలాఖరున రిటైర్‌మెంట్. ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తూ జీతాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాను కానీ, ఏ రోజూ డ్యూటీకి ఎగ్గొట్టలేదు. రిటైర్డ్ అయ్యేలోపు ఒక్కసారైనా కలెక్టర్ నుంచి ప్రసంసా పత్రం అందుకోవాలని కలలు కన్నాను. అవి నెరవేరకుండానే ఇంటికి వెళ్లిపోతున్నాను. ఆఫీసర్లను కాకాపట్టేవాళ్లు, చాడీలు చెప్పేవాళ్లకే గుర్తింపు. మా పేర్లంతా కలెక్టర్‌కు పంపరు.’
– జిల్లా కేంద్రంలోని ఓ ఉద్యోగి ఆవేదన
వాళ్ల బాధలు అర్థంకావా?
విధుల్లో నిబద్ధత.. అధికారుల పట్ల గౌరవం ప్రదర్శించే ఉద్యోగులను ఇప్పుడు చేతి వేళ్లపై లెక్కించే పరిస్థితి. ఫలితంగా ప్రతీ ఏటా పంద్రాగస్టు, గణతంత్య్ర దినోత్సవాల నాడు ఉత్తమ అధికారుల ఎంపిక యాంత్రికంగా కానిచ్చేస్తున్నారు. ఒకప్పుడు ఉద్యోగుల పనితీరు, క్రమశిక్షణ, పూర్వపు రికార్డులు పరిశీలించి, పరీక్షించి ఉత్తమ అవార్డుకు అధికారుల్ని ఎంపిక చేసేవారు. ఇప్పుడు ఉన్నతాధికారుల అడుగులకు మడుగులొత్తే వాళ్లు, రాజకీయనాయకుల వద్ద పీఏలు, గుమస్తాలు ఉత్తములైపోతున్నారు. కష్టపడి సేవలందించే అధికారులకు, సిబ్బందికి గుర్తింపు దక్కడం లేదు. ఉద్యోగ విరమణ వయస్సు దగ్గరపడుతున్నా తమ సేవలకు గుర్తింపు లేదని పలువురు కుమిలిపోతున్నారు.
ఒకప్పట్లో...
జిల్లాలోని వివిధ శాఖల్లో 30 వేల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల్ని ఎంపికచేసి ప్రశంసా పత్రాలు ఇవ్వడం ఆనవాయితీ. దశాబ్దన్నర కాలం క్రితం వరకు అయితే కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రం అందుకోవాలంటే సవాలక్ష కారణాలను పరిగణనలోకి తీసుకునే వారు. ప్రశంసా పత్రం తీసుకునే ఉద్యోగులు కుటుంబ సమేతంగా వచ్చి అతిథుల చేతులు మీదుగా అవార్డులు అందుకోవడం ఓ మధురానుభూతిగా భావించేవాళ్లు. కానీ కాలం మారిపోయింది. ఉద్యోగుల జాబితాను తయారు చేయడంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖాధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ వారికి నచ్చిన పేర్లనే ఉన్నతాధికారులకు పంపుతున్నారనే ఆరోపణలున్నాయి.