నగరి : చైన్నె, తిరుత్తణి, రేణిగుంట నేషనల్ హైవే 716 పనులను, 205 రహదారి వెడల్పు పనులను కలెక్టర్ సుమిత్‌కుమార్ గురువారం పరిశీలించారు. జాతీయ రహదారి వెడల్పులో భాగంగా ఆలయాలు, నివాసాలు తొలగించనుండడంతో పాటు టోల్ ప్లాజా ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతామన్న రైతుల నుంచి పలు వినతులు అందడంతో వాటిని ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఆయన నగరికి విచ్చేశారు. సమస్య ఉత్పన్నమైన నెత్తంకండ్రిగ, వీకేఆర్‌పురం ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. అక్కడకు చేరుకున్న స్థానికులు ఇప్పటికే జాతీయ రహదారికి 200 మీటర్ల మేర తమ స్థలాలను ఇచ్చేశారని, మిగిలిన స్థలాల్లో నివాసాలు ఏర్పరచుకున్నామన్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో టోల్ ప్లాజా ఏర్పాటు చేస్తున్నామని, అందుకు మళ్లీ స్థలం కావాలంటున్నారని, తాము చాలా నష్టపోతామని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. తమకు న్యాయం చెయ్యాలని కోరారు. ఈ అంశంపై జాతీయ రహదారి అధికారులతో చర్చించిన కలెక్టర్ రహదారి మ్యాపులు పరిశీలించి, జాతీయ రహదారికి సంబంధిత ఉన్నతాధికారులతో చర్చిస్తానన్నారు. ఆర్డీవో అనుపమ, డీఎస్పీ సయ్యద్ అబ్దుల్‌అజీజ్, తహసీల్దార్ రవికుమార్, సర్వేయర్ సురేష్, భూములు, నివాసాలు కోల్పోయే వారు పాల్గొన్నారు.