
పులివెందుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
నగరి : పులివెందుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి ఆర్కేరోజా ఆరోపించారు. ఉప ఎన్నికలు జరిగిన తీరుపై ఆమె గురువారం ఈ మేరకు స్పందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 62 శాతం ఓట్లు సాధించిందన్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లోనే 62 శాతం ఓట్లు సాధించిన పార్టీకి అనుకూల వాతావరణం నెలకొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో 8.95 శాతం ఓట్లు రావడం ఏమిటన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాపితంగా అనుకూల గాలి వీచిన సమయంలో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీ సాధించింది 24 శాతం ఓట్లు మాత్రమే అన్నారు. అలాంటి పార్టీకి 88 శాతం ఓట్లు రావడం యావత్ రాష్ట్రాన్ని షాక్‌లో ముంచిందన్నారు. ఎన్నికల్లో పోటీచేసిన మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులకి వరుసగా 0, 1, 2, 3, 4 ఓట్లు రావడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. అంటే పోటీ చేసిన అభ్యర్థి తాలుకా ఏజెంట్లు వారి కుటుంబ సభ్యులు కూడా వారికి ఓటు వేయరా?.. పోటీ చేసిన అభ్యర్థి కూడా తనకు తాను ఓటు వేసుకోడా? ఈ ఫలితాన్ని జనం ఎలా నమ్మాలన్నారు. అధికార దుర్వినియోగం, రౌడీయిజం, అవకతవకలే ఈ విజయం సాధించి పెట్టాయన్నారు.