
ఆధార్ కేంద్రాల్లో ఇబ్బంది పెట్టొద్దు
చిత్తూరు కార్పొరేషన్ : సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకులు బాధ్యతగా పనిచేయాలని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. మంగళవారం జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని సచివాలయ డిజిటల్ సహాయకులకు ఆధార్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆధార్ కోసం రద్దీ వచ్చినప్పుడు వారితో మర్యాదగా నడుచుకోవాలన్నారు. పదేపదే కార్యాలయాలకు తిప్పించుకోకుండా అప్పటికప్పుడు పనులు చేసి పంపాలన్నారు. ప్రస్తుతం అధికంగా సచివాలయాల్లో యువత పనిచేస్తున్నారన్నారు. కొందరు ప్రతి చిన్న విషయానికి ప్రజలను విసుక్కుంటున్నారని తెలుస్తోందన్నారు. ఏదో సమస్యల పై కార్యాలయానికి వచ్చేవారితో అమర్యాదగా నడుచుకోవద్దన్నారు. అనంతరం డీఎల్‌డీఓలు రవికుమార్, ఇందిరా మాట్లాడారు. ఇటీవల బదిలీలపై ఉద్యోగులు మారడంతో వారి కోసం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్, పుట్టినరోజు ,పేరు మార్పు వంటి సేవల పై మరింత అవగాహన తెచ్చుకోవాలన్నారు.

ఆధార్ కేంద్రాల్లో ఇబ్బంది పెట్టొద్దు