
మా మీద దయ చూపరా..!
● పెండింగ్‌లో 6 విడతల రీయింబర్స్‌మెంట్ బకాయిలు ● విద్యాశాఖ మంత్రికి విన్నవించినా స్పందన కరువు ● అయోమయంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ● నేడు తాడేపల్లిలో ఏపీ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన
తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ రెండేళ్ల బకాయిలు చెల్లించకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు డిగ్రీ ప్రైవేటు కళాశాలలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటి వరకు జరగకపోవడంతో పాటు 2023 నుంచి 2025 వరకు ప్రభుత్వం నుంచి సుమారు ఆరు విడతల బకాయిలు అందకపోవడంతో కళాశాలలను ఎలా కొనసాగించాలో అర్థం కాని పరిస్థితిలో యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి. ఏడాది నుంచి పలుమార్లు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కలిసి విన్నవించినా స్పందన లేదు. దీంతో ఏపీ ప్రైవేటు డిగ్రీ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ఏపీపీడీసీఎంఏ) ఆధ్వర్యంలో తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు శాంతియుతంగా ధర్నా నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలని సిద్ధమయ్యారు.
6 విడతల బకాయిలు సుమారు
రూ.330.15 కోట్లు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సుమారు 108 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో 85 కళాశాలలు ఎక్కువ మంది విద్యార్థులతో కొనసాగుతున్నాయి. గత మూడేళ్లుగా 6 విడతల ఫీజురీయింబర్స్‌మెంట్ సుమారు రూ.330.15 కోట్లు ప్రభుత్వం బకాయిలు పెట్టింది.
ఉమ్మడి జిల్లా సమాచారం
ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 108
చదువుతున్న విద్యార్థుల సంఖ్య 47,360
పెండింగ్‌లో ఉన్నది 6 విడతలు
బకాయిలు మొత్తం రూ.330.15 కోట్లు
ఒక్కో డిగ్రీ కళాశాలకు
సుమారు రూ.3.05 కోట్లు
ఒక్కో విద్యార్థికి సరాసరి
అందాల్సిన మొత్తం రూ.18,000
ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం
ఆరువిడతల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభు త్వం చెల్లించకపోవడంతో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయాం. కనీసం నూతన విద్యాసంవత్స రం ప్రారంభం కావడంతో ఉద్యోగులకు, అధ్యాపకులు జీతాలు ఇవ్వలేని దుస్థితి. కళాశాల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణం బకాయిలను విడుదల చేయాలి. – పట్నం సురేంద్రరెడ్డి, ప్రైవేటు
డిగ్రీ కాలేజీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
తక్షణం విడుదల చేయాలి
పెండింగ్ రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభు త్వం తక్షణమే విడుదల చేయాలి. గత 6 విడతలకు సంబంధించి సుమారు జిల్లాకు రూ.330 కోట్లు రావాల్సి ఉంది. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చి నాలుగు మాసాలు గడుస్తున్నా ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ రాకపోవడం విచారకరం. ఈ ఏడాది కళాశాలలో కనీసం 50 శాతం అడ్మిషన్లు జరుగుతాయనే నమ్మకం లేదు. సింగిల్, డబుల్ మేజర్ అంటూ డిగ్రీ అడ్మిషన్ల విషయంలో అయోమయం నెలకొంది. – ప్రైవేటు డిగ్రీ కళాశాల
యాజమాన్యాలు, తిరుపతి జిల్లా