
నకిలీ బిల్లులతో హైటెక్ మోసం
– రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న వైఎస్సార్ సీపీ నేతలు
విజయపురం : మండలంలోని మహారాజపురంలో నకిలీ బిల్లులతో తమిళనాడుకు తరలి వెళ్తుంటే ఆరు గ్రావెల్ టిప్పర్లను వైఎస్సార్ సీపీ నేతలు నకిలీ బిల్లులతో సహా రెడ్ హ్యాండెడ్‌గా మంగళవారం సాయంత్రం పట్టుకొన్నారు. దీంతో హైవే పేరుతో హైటెక్‌గా జరుగుతున్న మోసం బట్టబయలైంది. వారు తహసీల్దార్‌కు సమాచారం అందించగా బిల్లులు పరిశీలించిన ఆయన టిప్పర్లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో ఏడాది కాలంగా జరుగుతున్న అవినీతి వ్యాపారం వెలుగుచూసింది. వివరాలు ఇలా..
విజయపురం మండలంలోని మహారాజపురంలోని గ్రావెల్ క్వారీలు తమిళనాడు సరిహద్దుకు ఆనుకొని ఉండటంతో అక్రమార్కుల కన్ను దానిపై పండింది. దీంతో కూటమి నేతలు అక్రమార్జనకు ఇది కల్పతరువుగా మారింది. గ్రావెల్ తమిళనాడుకు తరలిస్తూ ఒక టిప్పర్‌కే సుమారు రూ.10 నుంచి 15 వేల ఆదాయం గడిస్తున్నారు. ఇలా రోజుకు సుమారు 100 టిప్పర్లు తరలిస్తున్నారు.
తరలింపు కోసం నకిలీ బిల్లులు
టిప్పర్ల రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా తమిళనాడు వెళ్లడానికి ఏపీ గనులు శాఖ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించారు. ఆ బిల్లులతోనే గ్రావెల్ తరలిస్తున్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ నేతలు లారీలను అడ్డుకొని బిల్లులు పరిశీలిస్తే గ్రావెల్ తరలిస్తున్నది మహారాజపురంలో అయితే కౌలు పొందిన క్వారీ ప్రదేశం నగరి మండలం కాకవేడు అని చూపడం అది తిరుపతి జిల్లాలో ఉన్నట్లు చూపడంతో బిల్లులు నకిలీవని తేలిపోయింది. ఏడాది పాటుగా జరుగుతున్న అసలు దందా వెలుగుచూసింది. వాహనాలను వదిలేసి డ్రైవర్లు కూడా పరారీ కావడం అక్రమ వ్యాపారానికి అద్దం పట్టింది.
● ఈ సంఘటనపై తహసీల్దార్ కిరణ్ మాట్లాడుతూ.. గ్రావెల్ తరలించే టిప్పర్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. బిల్లులపై అనుమానం ఉండడంతో మైనింగ్ అధికారులకు సమాచారం అందించామన్నారు. సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకొంటామని తెలిపారు.

నకిలీ బిల్లులతో హైటెక్ మోసం