
గజరాజులను కాపాడుకుందాం
పలమనేరు : కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులు ఉండడం మన అదృష్టమని వాటిని మన సంపదగా భావించి వాటిని కాపాడుకుందామని పలమనేరు సబ్ డీఎఫ్‌ఓ వేణుగోపాల్ సూచించారు. మండలంలోని మొసలిమడుగు కుంకీ ఏనుగుల క్యాంప్‌లో మంగళవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని స్థానిక అటవీశాఖ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏనుగులను అలంకరించి వాటికి పూజలు చేసి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విడత థీమ్‌గా మాతృస్వాములు వాటి జ్ఞాపకాలుగా నిర్ణయించారన్నారు. గుంపులోని పెద్ద ఆడ ఏనుగు ఓ పెద్దమ్మలా గుంపును రక్షించుకుంటూ నడిపించడం చేస్తూ వాటి ఉనికికి మార్గాన్ని చూపుతుందన్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని ఏనుగులు అడవిని దాటి కరెంట్ బారీన పడి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. గ్రామాల్లోకి ఏనుగులు వచ్చినప్పుడు ప్రజలు వాటిపై దాడులు చేయడం లాంటివి చేయరాదన సూచించారు. ఏనుగులను కాపాడుకునేందుకు అందరం భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎఫ్‌ఆర్వో నారాయణ, పలువురు ఎఫ్‌ఎస్వోలు, ఎఫ్‌బీవోలు, మావటీలు, సిబ్బంది, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.