
ఫీజు బకాయిలపై పోరుబాట
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం కళాశాలలు ఎలా నిర్వహించుకోవాలని ఆవేదన ఇప్పటి వరకు ఒక్క విడత ఫీజు బకాయి చెల్లించలేదని ఆరోపణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ నాయకుల మండిపాటు
● ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం ● కళాశాలలు ఎలా నిర్వహించుకోవాలని ఆవేదన ● ఇప్పటి వరకు ఒక్క విడత ఫీజు బకాయి చెల్లించలేదని ఆరోపణ ● ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ నాయకుల మండిపాటు
చిత్తూరు కలెక్టరేట్ : ఫీజు బకాయిల కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆ అసోసియేషన్ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచికళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చిల్లిగవ్వకూడా ఇవ్వలేదన్నారు. ఫీజు బకాయిలు ఇవ్వకపోతే కళాశాలలు ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. అప్పులు చేసి కళాశాలలు నిర్వహిస్తున్న తమ పరిస్థితి ఏమవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి 3 విడతల ఆర్‌టీఎఫ్, 2024–25 విద్యాసంవర్సంలో 3 మొత్తం 6 విడతల ఆర్టీఎఫ్ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. తమ సమస్యను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొరపెట్టుకుంటున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన విద్యాశాఖామంత్రి లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. అయినా ఏ మాత్రం స్పందన లేదన్నారు. బకాయిలు విడుదల కాకపోవడంతో సిబ్బంది జీతాలు, రవాణా, కళాశాల నిర్వహణ కష్టతరమవుతోందన్నారు. చాలామంది కరస్పాండెంట్లు అప్పుల ఉబిలో కూరుకుపోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ఈనెల 13న తాడేపల్లిలోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ అసోసియేషన్ నాయకులు బాలాజీ, వాసు, ప్రభు, సురేష్, జానకిరామిరెడ్డి పాల్గొన్నారు.