ఆకాశంలో మూడో కన్ను | - | Sakshi
Sakshi News home page

ఆకాశంలో మూడో కన్ను

Aug 12 2025 7:43 AM | Updated on Aug 13 2025 4:46 AM

ఆకాశం

ఆకాశంలో మూడో కన్ను

ఖాకీ యూనిఫామ్‌ ధరించనున్న డ్రోన్లు పోలీసుశాఖలో సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బంది జిల్లాకు 41 డ్రోన్లు అవసరమని నివేదించిన ఎస్పీ నేర నియంత్రణ.. అసాంఘిక శక్తుల గుర్తింపే లక్ష్యం

అన్నింటా ఇపుడు ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) పరిజ్ఞానం వచ్చేసింది. విద్య, వైద్యం, ఆఖరుకు హెయిర్‌కట్‌ చేసే దుకాణాల్లో సైతం వ్యక్తి ముఖాకృతికి తగ్గట్టు హెయిర్‌ స్టయిల్‌ను సూచించే కంప్యూటర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనేన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దొంగలను పట్టుకోవడం.. అసలు దొంగతనాలే జరగకుండా ఉండడానికి పోలీసుశాఖ అడుగులు వేస్తోంది. ఏఐకు డ్రోన్లు జోడించి నిఘా ఉంచడానికి జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది.

చిత్తూరు అర్బన్‌: పోలీసు శాఖకు డ్రోన్ల అవసరం కచ్చితంగా ఉంది. ఎవరైనా దొంగ చైన్‌స్నాచింగ్‌ చేసి పారిపోతుంటే అతని వెంట పరుగెత్తే రోజులు పాతకాలంవి. ఇప్పుడు కూర్చున్నచోటు నుంచే సెల్‌ఫోన్‌లో చూస్తూ దొంగను పట్టుకోవచ్చు. దీనికి డ్రోన్‌ సాయం చేస్తుంది. కాలంతో పోటీపడుతూ నేరం చేసే నిందితులు సరికొత్త మార్గాల్లో దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ఈ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసుశాఖ కూడా జవాబునిచ్చేందుకు సిద్ధపడుతోంది. రోడ్లపై పోలీసులు కనిపిస్తే తప్పుచేసే వాళ్లు కాస్త ఆలోచిస్తారని నిత్యం గస్తీలు నిర్వహిస్తుంటారు. దీంతో పాటు నగరాలు, పల్లెటూర్లలో శివారు ప్రాంతాలు, కొండలు–గుట్టల్లో పేకాట ఆడటం, గంజాయి సేవించడం, అడవుల్లో నాటుసారా తయారు చేయడం లాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, నగరి, కుప్పం, చిత్తూరు సబ్‌–డివిజన్లలో ఇప్పటికే పోలీసులు డ్రోన్లను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు.

ప్రతీ స్టేషన్‌కు ఓ డ్రోన్‌

జిల్లాలోని నాలుగు సబ్‌–డివిజన్లలో ఉన్న నాలుగు డ్రోన్లు అన్ని స్టేషన్ల అవసరాలను వినియోగంచడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో జిల్లాలోని ప్రతీ స్టేషన్‌కు డ్రోన్లు ఇవ్వడానికి రాష్ట్ర హోంశాఖ ఇప్పటికే పోలీసుశాఖ నుంచి వివరాలు తీసుకుంది. జిల్లాలోని 38 పోలీస్‌ స్టేషన్లతో పాటు అదనంగా మరో మూడు డ్రోన్లు కావాలని జిల్లా పోలీసుశాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందింది. స్టేషన్‌కు ఓ డ్రోన్‌ వస్తే శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి ఎంతో ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

శిక్షణ పూర్తిచేసుకున్న ఖాకీలు

డ్రోన్లను ఉపయోగించడానికి చిత్తూరు పోలీసుశాఖ నుంచి ఇటీవల సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయ్యింది. మొత్తం 42 మందికి డ్రోన్లను వినియోగించే పద్ధతులపై చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ప్రతీ స్టేషన్‌ నుంచి ఓ కానిస్టేబుల్‌ను పిలిపించి శిక్షణ ఇప్పించారు.

ఖాకీ యూనిఫామ్‌ ధరించనున్న డ్రోన్లు పోలీసుశాఖలో సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బంది జిల్లాకు 41 డ్రోన్లు అవసరమని నివేదించిన ఎస్పీ నేర నియంత్రణ.. అసాంఘిక శక్తుల గుర్తింపే లక్ష్యం

డ్రోన్ల ద్వారా క్రైమ్‌ తగ్గిస్తున్నాం

జిల్లాలో ప్రస్తుతానికి ప్రతీ సబ్‌–డివిజన్‌కు ఓ డ్రోన్‌ ఉంది. రొటేషన్‌ పద్ధతిలో స్టేషన్లకు వీటిని ఉపయోగిస్తున్నాం. ప్రతీ స్టేషన్‌కు డ్రోన్‌ ఇవ్వడానికి ప్రతిపాదనలు వెళ్లాయి. సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కూడా ఇప్పించాం. డ్రోన్ల ద్వారా నిఘా ఉంచడం వల్ల నేరం జరిగినపుడు నిందితుడ్ని పట్టుకోవడంతో పాటు.. అసలు నేరం జరగకుండా కూడా నియంత్రిస్తున్నాం. దీనివల్ల క్రైమ్‌ తగ్గుతోంది. – సాయినాథ్‌, డీఎస్పీ, చిత్తూరు

ఆకాశంలో మూడో కన్ను 1
1/2

ఆకాశంలో మూడో కన్ను

ఆకాశంలో మూడో కన్ను 2
2/2

ఆకాశంలో మూడో కన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement