
నిరక్షరాస్యులకు వరం ఓపెన్ స్కూల్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఓపెన్ స్కూల్ విధానాన్ని నెలకొల్పారని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఓపెన్ స్కూల్ అడ్మిషన్‌ల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలన్నారు. చదువు మధ్యలో మానేసిన, బడికి వెళ్లే పరిస్థితి లేని వారికి సార్వత్రిక (ఓపెన్ స్కూల్) విధానం ఎంతో సులభమైందన్నారు. డీఈవో వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ విధానంలో పది, ఇంటర్ కోర్సులకు అడ్మిషన్‌లు చేస్తున్నట్టు తెలిపారు. ఆగస్టు 31, 2025 నాటికి 15 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అడ్మిషన్‌లు పొందవచ్చన్నారు. అభ్యర్థులకు ఏప్రిల్, మే, జూలై నెలల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హత ఉంటుందన్నారు. పదో తరగతికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100, అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీకి రూ.1,300, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులకు రూ.900 చెల్లించాలన్నారు. ఇంటర్మీడియెట్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200, అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీకి రూ.1,400, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులకు రూ.1,100 చెల్లించాలన్నారు. అనంతరం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, డ్వామా పీడీ రవికుమార్, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ, డీఈవో కార్యాలయం ఏడీ–2 వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.