
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
యాదమరి: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. డీఎస్పీ సాయినాథ్ కథనం మేరకు.. యాదమరి మండలం, బోదగుట్టపల్లి పంచాయతీ, తొట్టిగానిఇండ్లుకు చెందిన సదాశివం కుమారుడు విజయకుమార్(26) తమిళనాడు రాష్ట్రం పరదరామిలో ఆవుల వ్యాపారం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆదివారం స్వగ్రామానికి వచ్చాడు. సాయంత్రం స్నేహితులను కలిసి వస్తానని చెప్పి వెళ్లాడు. ఆపై ఎంతకూ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సోమవారం మృతుని తండ్రి సదాశివం కనికాపురం చెరువు వద్ద ఉన్న తన పొలం గట్టుకు వెళ్లాడు. అక్కడ విజయకుమార్ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ సాయినాథ్, తవణంపల్లి ఎస్‌ఐ చిరంజీవి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు అనుమానం వ్యక్థం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఐదో రోజూ ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలో గత ఐదు రోజులుగా పంట పొలాలపై ఏనుగుల దాడులు ఆగనంటున్నాయి. సోమవారం మండలంలోని గండోలపల్లె, బాలిరెడ్డిగారిపల్లె, దేశిరెడ్డిగారిపల్లెల్లోని పొలాలపై పడి వేరుశనగ, మామిడి, కొబ్బరి చెట్లు, వరి మడులను నాశనం చేశాయి.