
విద్యార్థి భవితకు విజ్ఞాన్ మంథన్
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషన్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహకాలు, దేశంలో సీఎస్‌ఐఆర్, ఐఎస్‌ఆర్‌ఓ, బార్క్, డీఆర్‌డీఓ ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశం, ఇంటర్న్‌షిప్, స్కాలర్‌షిప్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ వీవీఎం పట్ల జిల్లాలోని క్షేత్రస్థాయి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో దాగి ఉన్న శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించేందుకు, వారిలో దాగిన సృజనాత్మకత ఆలోచనలు, ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, విజ్ఞాన భారతి సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) పేరిట జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు చదివే వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్, స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఇందుకు గానూ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల పక్రియ ప్రారంభమైంది.
దరఖాస్తుల ఆహ్వానం
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30వతేదీ వరకు గడువు ఉంటుంది. ఆన్‌లైన్‌లో పాఠశాల స్థాయిలో పరీక్ష జరుగుతుంది. 6వ తరగతి నుంచి 11(ఇంటర్ మొదటి సంవత్సరం)తరగతుల వరకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.
వంద మార్కులకు పరీక్ష
ఈ పరీక్షకు సంబంధించి మాక్ పరీక్షలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబరు 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి సెకండ్ లెవెల్(ద్వితీయ పరీక్ష) పరీక్ష ఆన్‌లైన్‌లో ప్రోక్టరింగ్ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్ 19వ తేదీన ఉంటుంది.
జాతీయస్థాయికి ఎంపిక ఇలా..
రాష్ట్రస్థాయి విజేతల్లో ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థుల వంతున 12 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థుల వంతున 18 మందిని విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు నెలకు రూ.2000 చొప్పున సంవత్సరం పాటు భాస్కర ఉపకార వేతనం అందజేస్తారు.
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025–26లో జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్‌డీఓ, ఇస్రో, సీఎస్‌ఐఆర్, బీఏఆర్‌సీ మొదలైన ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో 1 నుంచి 3 వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తారు.
విజ్ఞాన మంథన్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న విద్యాశాఖ అధికారులు
6 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు అవకాశం
ఎంపికై తే స్కాలర్‌షిప్, ప్రఖ్యాత పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్
కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో..
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, శాస్త్ర, సాంకేతిక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఏటా నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వీవీఎం అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
జిల్లాలోని స్కూళ్లు, కళాశాలల సమాచారం
కేటగిరీ స్కూళ్ల సంఖ్య విద్యార్థుల సంఖ్య ప్రాథమిక 4,247 59,067
ప్రాథమికోన్నత 738 42,380
ఉన్నత 1,203 30,307
జూనియర్ కళాశాలలు 238 27,700
మొత్తం 6,426 1,59,454
సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వీవీఎం.ఓఆర్‌జి.ఇన్ వెబ్‌సైట్‌లో లాగిన్ కావొచ్చు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీతత్వాన్ని పెంచుకునేందుకు ఈ పరీక్ష ఎంతో దోహదపడుతుంది. పరీక్ష వల్ల కలిగే ఉపయోగాలపై జిల్లాలో అవగాహన కల్పిస్తున్నాం. – బి.హిమబిందు,
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ జిల్లా కోఆర్డినేటర్, చిత్తూరు
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం
ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్షల్లో పాల్గొనేలా హెచ్‌ఎంలు కృషి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే స్కాలర్‌షిప్‌తో పాటు ప్రఖ్యాత పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని కలిగించి నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వరలక్ష్మి, డీఈవో, చిత్తూరు జిల్లా.

విద్యార్థి భవితకు విజ్ఞాన్ మంథన్

విద్యార్థి భవితకు విజ్ఞాన్ మంథన్