
జ్యోతిష్యం చెబుతానని చెప్పి..
– మహిళ మెడలో నగలు ఎత్తుకెళ్లిన దుండగుడు
బైరెడ్డిపల్లె: గుర్తు తెలియని వ్యక్తి ఓంశక్తి మాల ధరించి ఓ వృద్ధురాలి వద్ద నగలు దోచికెళ్లిన సంఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లెలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు..నాగిరెడ్డిపల్లెకు చెందిన లక్ష్మమ్మ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఓంశక్తి మాల ధరించి అక్కడకు చేరుకున్నాడు. లక్ష్మమ్మ పలకరించగా తాను జ్యోతిష్యం చెబుతానని, కష్టాలు ఉంటే పోగొడతానని నమ్మించాడు. ఇసుక గ్లాసులో తీసుకువచ్చి అందులో నీరు, పసుపు కలపమని చెప్పాడు. ఇసుక తీసుకొచ్చి నీరు, పసుపు కలుపుతున్న సమయంలో లక్ష్మమ్మపై మత్తు మందు చల్లి సుమారు రూ.2 లక్షలు విలువ చేసే నగలను దోచుకెళ్లాడు. ఈ విషయంపై బాధితురాలు బైరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జిల్లా చెస్ పోటీల్లో అర్జున్ ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్: నగరిలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీల్లో చిత్తూరు నగరానికి చెందిన న్యూయార్క్ స్కూల్ విద్యార్థి అర్జున్ 2వ బహుమతి గెలుపొందాడని ఆంధ్రా చెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నగరి, నగరి చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 250 క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొని రెండవ స్థానాన్ని కై వసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని న్యూయార్క్ స్కూల్ చైర్మన్ శ్రీధర్ అన్నారు. అనంతరం అతన్ని పలువురు అభినందించారు.
పోలీసుల అదుపులో గంజాయి విక్రేత !
పూతలపట్టు(యాదమరి): జిల్లాలో మత్తు పదార్థాలకు నిలయమైన పూతలపట్టు మండలం బండపల్లిలో గంజాయి విక్రయదారుడిని పూతలపట్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థకు చెందిన కొందరు విద్యార్థులు నిత్యం గంజాయి కోసం బండపల్లిలోని ఓ గంజాయి స్మగ్లర్ రహస్య స్థావరానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఆదివారం కాలేజీలకు సెలవు కావడంతో మత్తుకు బానిసైన విద్యార్థులు అధికంగా వచ్చారు. సరఫరాదారు వద్ద అవసరానికి తగ్గ గంజాయి లేకపోవడంతో.. రెగ్యులర్ వినియోగదారులకు తప్ప కొత్తగా వచ్చిన వారికి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన కొందరు విద్యార్థులు సరఫరాదారులపై వాగ్వాదానికి దిగారు. కాగా అక్కడ జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఓ విద్యార్థి పూతలపట్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతని నుంచి దాదాపు రూ.3000 విలువ చేసే 250 గ్రాముల శీలావతి అనే అత్యంత విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జ్యోతిష్యం చెబుతానని చెప్పి..