
చదువుకోవడానికి చెట్లు అడ్డుగా ఉన్నాయట..!
● గుడిపాల మండలం చీలాపల్లె స్కూల్‌లో భారీ వృక్షాల నరికివేత ● తమకు విషయమే తెలియదంటున్న ఎంఈఓలు ● తహసీల్దార్‌కు ఇచ్చిన అర్జీని సాకుగా చూపి పని కానిచ్చిన ప్రబుద్ధులు
గుడిపాల: ఆ ప్రభుత్వ పాఠశాలలో భారీ వృక్షాలతో ఆహ్లాదం వెల్లివిరిసేది. అయితే ప్రకృతిలో దేన్నీ వదలని కొందరి కన్ను ఆ చెట్లపై కూడా పడింది. సమయం కోసం చాలా రోజులుగా వేచి చూశారు. తాజాగా మూడురోజుల పాటు సెలవులు రావడంతో పని కానిచ్చారు. వివరాలు.. మండలంలోని చీలాపల్లె పాఠశాలలో భారీ వృక్షాలు ఉన్నాయి. అయితే వారి పని కానిచ్చేందుకు పాఠశాల విద్యాకమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి అందులో చెట్లలో ఉన్న కొమ్మలను మాత్రం నరికేందుకు పాఠశాల కమిటీ చైర్మన్, సర్పంచ్, విద్యార్థుల వద్ద సంతకాలు సేకరించారు. ఆపై స్కూల్‌లో పని చేసే టీచర్‌తో తహసీల్దార్‌కు పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఈ చెట్ల వల్ల ఆటంకం ఉందని కాకమ్మ కథ అల్లి వినతిపత్రం ఇప్పించారు. సదరు తహసీల్దార్ వెంటనే పంచాయతీ కార్యదర్శికి ఎండార్స్ చేసి రిపోర్ట్ ఇవ్వమని అడిగారు. అయితే ఇక్కడే సదరు వ్యక్తులు తెలివి ఉపయోగించారు. ఆ అర్జీని సాకుగా చూపుతూ తహసీల్దార్ చెట్లు కొట్టేందుకు అనుమతి ఇచ్చారని గ్రామంలో హడావుడి చేశారు. ఎలాగూ మూడు రోజుల పాటు సెలవులు కావడంతో సదరు నేతలు పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లన్నీ నరికేశారు. గ్రామస్తులు, ఇదే పాఠశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఎందుకు చెట్లను నరుకుతున్నారని అడిగితే విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని కొట్టేశామని నమ్మించారు. అయితే అడ్డంగా ఉంటే చెట్లకొమ్మలు కొట్టాలి కానీ చెట్లన్నీ ఎలా కొడతారని నిలదీశారు ?. ఈవిషయంపై సాక్షి గుడిపాల ఎంఈఓలు హసన్‌బాషా, గణపతిని వివరణ కోరగా తమకు తెలియదని చెప్పారు. తహసీల్దార్ మాత్రం తనకు అర్జీ ఇచ్చారని.. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శికి రెఫర్ చేశానన్నారు. అయితే ఆదివారం చెట్లను నరికి మొద్దులను ఐచర్ వ్యాన్‌లోకి లోడ్ చేస్తున్న విషయాన్ని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి చెప్పారు. అయితే వ్యాన్ ఆపాలని సూచించారు. అయితే కొద్దిసేపటికే ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో కానీ కలప లోడ్‌తో ఉన్న వాహనం వెళ్లిపోయింది. ఎంతో ఆహ్లాదాన్ని పంచే వృక్షాలను ఇలా నరికేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.