
కిక్కు పర్మినెంట్!
చిత్తూరు అర్బన్: తొమ్మిది నెలలు నిండాయి. కాన్పుకు కాదు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చి. నెలలు నిండిన బిడ్డ ఆరోగ్యంగా ఉందా..? ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా..? అని చూడాలి కదా. జిల్లాలో అమలవుతున్న నూతన మద్యం పాలసీ పరిశీలిస్తే.. కేవలం పచ్చ నేతలకు నెలవారి తాయిలాలు, ఆబ్కారీలోని కొందరు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోందనడంలో సందేహం లేదు.
అందరూ వాళ్లే..
జిల్లాలో గతేడాది అక్టోబర్ 15 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాగినోడికి తాగినంత అనే నినాదంతో ముందుకు వెళుతోంది. చిత్తూరు జిల్లాలోని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ పరిధిలో ఎనిమిది సర్కిల్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో అన్–రిజర్వుడు కింద 104 మద్యం దుకాణాలు, కల్లుగీత సామాజిక వర్గాలకు 9 మద్యం దుకాణాలు చొప్పున లైసెన్సులు జారీఅయ్యాయి. మద్యం దుకాణాల లైసెన్సులు దక్కించుకున్న వారిలో దాదాపు అధికార పార్టీకి చెందిన నాయకులు, సానుభూతిపరులే ఉన్నారు. ఒకరిద్దరు బయటివాళ్లకు లైసెన్సులు వచ్చినా.. వాళ్లను ఇబ్బందులు పెట్టిన నాయకులు, దారిలోకి తెచ్చుకుని అమ్మకాల్లో వాటాలు తీసుకుంటున్నారు.
ఎవరి వాటా వాళ్లదే!
పర్మిట్ గదులు వెలసినచోట.. మరే వ్యాపారం చేయడానికి వీలుండదు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు నిత్యం గొడవలు పడడం, తాగి అక్కడే వాంతులు చేసుకోవడం, పడిపోవడం సర్వసాధారణం. ప్రతీ పర్మిట్ గదికి ఎకై ్సజ్, ఖాకీలు కప్పం వసూలు చేస్తున్నారు. ఈ కప్పంలో ఎకై ్సజ్ అధికారులు ఒక్కో దుకాణానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూతలపట్టులోని ఓ అధికారికి నెలవారీ మామూళ్లు రాకపోవడంతో రెండు పర్మిట్ గదులు మూయించడంతో, తీవ్ర కోపానికి లోనైన ఓ నేత ఆ అధికారికి ఛీవాట్లు పెట్టడంతో మళ్లీ అవి తెరుచుకున్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదికాదన్నట్లు మద్యం దుకాణాలున్న నియోజకవర్గంలో వాటి యజమానులు ఇష్టం ఉన్నా, లేకున్నా పచ్చ నేతలను వాటాదారుడిగా చేర్చుకోవాల్సిందే. వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడి పెట్టని కూటమి నేతలు 5 నుంచి 7 శాతం వరకు.. అంటే నెలకు రూ.8 కోట్ల పైనే లాభాలు ఆర్జిస్తున్నారన్న మాట.
కాసులు కురిపించే కల్పవృక్షంగా మద్యం దుకాణాలు
విచ్ఛలవిడి అమ్మకాలు.. అనధికార పర్మిట్ గదులు
‘పర్మిట్’లో పచ్చ నేతలు, ఖాకీలకు నెలవారి మామూళ్లు
రూ.కోట్లు కురిపిస్తున్న ‘ప్రైవేటు’ మద్యం అమ్మకాలు
జిల్లాలో మద్యం దుకాణాలు, విక్రయాలు
మద్యం దుకాణాలు – 104
కల్లుగీత మద్యం దుకాణాలు – 09
అనుమతుల్లేని పర్మిట్ గదులు – 350పై చిలుకు
మద్యం విక్రయాలు (నెలకు) – రూ.124.20 కోట్లు
పర్మిట్ గదుల్లో వ్యాపారం
(నెలకు) – రూ.10.50 కోట్లు
మొత్తంగా వచ్చే లాభాలు
(నెలకు) – రూ.20.26 కోట్లు
అధికారులకు అందుతున్న
మామూళ్లు – రూ.2 కోట్లకు పైగా
నేతలకు ఇచ్చే నెలవారి వాటా – రూ.8.12 కోట్లు
పర్మిట్ గదులతో కిక్కు
మద్యం దుకాణాలకు మాత్రం ప్రభుత్వమే లైసెన్సులు జారీచేసింది. కానీ జిల్లాలో ప్రతీఒక్క మద్యం దుకాణానికి పక్కనే అనధికారిక పర్మిట్ గదులు ఉన్నాయి. మద్యం తీసుకున్న వ్యక్తి ఆ గదిలోకి వెళ్లి మద్యం సేవించడం, గ్లాసులు, కూల్ డ్రింకులు, స్టఫ్, సిగరెట్లు.. ఇలా ఓ మినీ సూపర్ మార్కెట్ పర్మిట్ గదుల్లో నడుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న పర్మిట్ గదుల్లో రోజుకు సగటున రూ.30 వేలకు పైనే వ్యాపారం జరగుతోంది. బార్లకు సమాంతరంగా ఉన్న పర్మిట్ గదులు నాయకులకు, ఎకై ్సజ్, పోలీసు అధికారులకు మామూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక గ్రామాల్లోని పర్మిట్ గదుల్లో సగటున రూ.10 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. జిల్లా మొత్తంగా ఉన్న మద్యం దుకాణాల వద్ద 350 వరకు పర్మిట్ గదులు ఉంటే.. నెలకు రూ.కోటికి పైగా వ్యాపారం ఇక్కడే జరుగుతోంది. ఇక మద్యం దుకాణాల్లో సగటున రోజుకు రూ.కోటి పైనే అమ్మకాలు జరగుతున్నాయి. ఈ రెండింటి నుంచే నెలకు దాదాపు రూ.20 కోట్లకు పైనే లాభాలు వస్తున్నాయి.

కిక్కు పర్మినెంట్!