
వరసిద్ధుడి క్షేత్రంలో పౌర్ణమి పూజలు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో శనివారం శ్రావణ పౌర్ణమి పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్‌కు అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కల్యాణ వేదికపై ఉత్సవమూర్తికి విశేష పూజలు జరిపించారు. అలాగే కల్యాణోత్సవం, ప్రాకారోత్సవం చేశారు. కార్యక్రమానికి కోదండరాంశెట్టి బ్రదర్స్ ఉభయదారులుగా వ్యవహరించారు. అలాగే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరదరాజులస్వామి ఆలయంలో సత్యనారాయణ వ్రతాన్ని భక్తిప్రపత్తులతో చేపట్టారు.
రాజనాలబండకు
పోటెత్తిన భక్తులు
చౌడేపల్లె: సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసపు మూడవ శనివారాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. అర్చకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు నిర్వహించారు. ఏటా శ్రావణమాసపు నెలలో చివరి శనివారం, ఆదివారం రోజున పదమూడు గ్రామాల ప్రజలు కలిసి రాజనాలబండలో ఉట్లొత్సవం, తిరుణాల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మూడవ శనివారపు పూజలు చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్ పర్యవేక్షణలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
సౌభాగ్యం తాంబూలం పంపిణీ
రాజనాల బండ ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో మహిళలకు సంప్రదాయబద్ధంగా సౌభాగ్యం తాంబూలాన్ని పంపిణీ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలనంతరం మహిళలకు సుమంగళిగా ఉండాలని, ఆయురోగ్యాలు సుఖ శాంతులతో ఉండాలని ఆశీర్వదిస్తూ పసుపు, కుంకుమ, గాజులతో పాటు మంగళి సూత్రం పంపిణీ చేశారు.
ఆశా పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి తుడా: ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద పలు పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ పరిధిలో 27 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. వయస్సు 25 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న మహిళా అభ్యర్థులు ఈనెల 16వ తేదీ లోపు తమ పరిధిలోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లకు దరఖాస్తులను అందజేయాలని కోరారు.