
‘నులి’మేద్దాం రండి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నులి పురుగుల సమస్య పిల్లలను కుంగదీస్తోంది. శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రక్తహీనతకు గురిచేస్తోంది. ఈ నెల 12న జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1– 19 పిల్లలు 3,62,535 మంది ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు 2,420 ఉండగా 77,318 మంది పిల్లలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 2,883 ఉండగా 2,40,658 పిల్లలు, ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియెట్ కళాశాలలు 163 గాను 43,402 మంది విద్యార్థులు, బడిబయట పిల్లలు 1,157 మందికి నులిపురుగు నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఈనెల 12న ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో గుర్తించిన పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. పంపిణీ కార్యక్రమం ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనుంది. కాగా 1–2 సంవత్సరాలు గల చిన్నారులకు సగం మాత్ర, 2–3 ఏళ్ల వారికి పూర్తి మాత్ర, 3–19 ఏళ్ల పిల్లలు ఒక మాత్రను నమిలి మింగాలని వైద్యులు చెబుతున్నారు.
చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి
పిల్లలు చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడం, మట్టిలో ఆడుకోవడం లాంటి కారణాలతో 1– 19 ఏళ్ల వయసు గల పిల్లల కడుపులో నులి పురుగులు తయారవుతాయి. అవి కడుపులో రక్తాన్ని పీల్చడంతో పాటు పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తరచూ అనారోగ్యం బారిన పడడం, బరువు తగడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడంతో పాటు చురుకుదనం కోల్పోతారు. ప్రస్తుతం ఇలాంటి పిల్లలు అంగన్‌వాడీ సెంటర్లలో అధిక మంది ఉన్నట్లు గుర్తించారు.
12 నుంచి నులిపురుగు నిర్మూలన కార్యక్రమం
విధిగా వేయించాలి
జిల్లాలోని చిన్నారులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి. విధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. నిర్లక్ష్యం ఉండకూడదు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నాలి. ముఖ్యమంగా అంగన్‌వాడీ, ఇతర ప్రభుత్వ పాఠశాలలు, వైద్య సిబ్బంది విధిగా హాజరు కావాలి. క్షేత్ర స్థాయిలో కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించాలి.
– సుధారాణి, డీఎంహెచ్‌ఓ, చిత్తూరు